నేలకొండపల్లి : నేలకొండపల్లి గుర్తుకు వచ్చినప్పుడల్లా అభివృద్ధి కార్యక్రమాలంటూ హడావిడి చేయవద్దు. అందమైన కలర్ ప్రింట్లు తీసి కాగితాలలో ప్రణాళికలు చేయకుండా, చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయాలని, పూర్తిస్థాయి చరిత్రను అందుబాటులోకి తెచ్చి, ఈ ప్రాంతానికి ఉన్న ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెచ్చి రాజీ లేని అభివృద్ధి ప్రణాళికలు చేస్తే ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చి ఇస్తానని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేలకొండపల్లి పర్యటనలో భాగంగా ఆయన బౌద్ధ స్థూప అభివృద్ధి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన సాంస్కృతిక, చారిత్రిక బౌద్ధ స్థూప పరిసరాలను అడుగడుగునా కలియతిరిగారు.క్షేత్ర ఆవరణలో త్రవ్వకాలు చేస్తున్న బౌద్ధ భిక్షువుల ఆరామాలను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, పురావస్తు, తెలంగాణా హెరిటేజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక సుమారు గంటన్నర పాటు బౌద్ధ క్షేత్రం యొక్క ప్రాధాన్యతను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పురావస్తు శాఖాధికారులు చెప్పిన వివరాలతో సంతృప్తి చెందని అమాత్యులు స్థానికంగా కొంతమంది వ్యక్తులతో మాట్లాడి పూర్వపు విషయాలను తెలుసుకున్నారు. ఇంకా దేశ వ్యాప్తంగా ఉన్న చరిత్రకారులను, బౌద్ధం సంబంధిత అంశాలలో పట్టున్న వ్యక్తులను పిలిపించి సమగ్ర పరిశోధన చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని ఓ కీలక చరిత్రకారునితోను అప్పటికప్పుడే ఫోన్ లోను మాట్లాడిన మంత్రి నేలకొండపల్లికి ఆహ్వానించారు. రానున్న పక్షం రోజులలో సమయం వ్యర్థం చేయకుండా పక్కా రోడ్ మ్యాప్ తయారు చేసేలా అధికారులకు, జిల్లా కలెక్టర్ కు పనిచేయాలని సూచించారు.
నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న 2, 3 వ శతాబ్దం నాటి బౌద్ధ స్తూపాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్దులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తాం.. గతంలో ప్రభుత్వాలు, పాలకులు అభివృద్ధి ప్రణాళికలు ప్రణాళికలు వేసినా మధ్యలోనే నిలిచిపోయాయి. పురావస్తు, తెలంగాణా చారిత్రక, సాంస్కృతిక శాఖతోనూ సంప్రదింపులు జరిపి పూర్తి చరిత్రను వెలుగులోకి తెస్తాం. నిపుణులు, చరిత్రకారులతో పాటు బౌద్ధ ప్రముఖులతో కూడా సలహాలు సూచనలు తీసుకుని ఒక అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా నేలకొండపల్లి ని ఉంచేందుకు ఎంత నిధులైనా ఖర్చు పెడతానని హామీ ఇస్తున్నాని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెరిటేజ్ శాఖ డైరెక్టర్ కుతాడి అర్జున్ రావు, హెరిటేజ్ శాఖ ఉప సంచాలకులు నాగరాజు, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, తహశీల్దార్ రాంప్రసాద్, కన్సల్టెంట్ శ్రీనివాస్, టూరిజం డీఈ రామకృష్ణ, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, స్థానిక సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.