జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు పొందిన రాజమౌళి ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారుడిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించడం వల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం లభించిందని ఆయన తెలిపారు. తన భార్య సలహాతో స్థిరమైన ఉపాధికి ప్రాధాన్యమిచ్చి ఉద్యోగంలో చేరానని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కరోనా సమయంలో టీవీ షోలు, ఈవెంట్లు నిలిచిపోయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగమే తన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం పాటలు, ఆటల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.కామెడీ టైమింగ్, అమాయకత్వంతో కూడిన డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ మేనరిజమ్స్, పేరడీ పాటలతో రాజమౌళి జబర్దస్త్ షోలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆయన ఫేస్‌లో ఎప్పుడూ ఒక అమాయకపు ఎక్స్ప్రెషన్ ఉండేది. ఎంత పెద్ద లాజిక్ లేని విషయాన్నైనా, చాలా అమాయకంగా, నిజాయితీగా చెప్తున్నట్లుగా మాట్లాడి నవ్వించేవాడు. ముఖ్యంగా రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్ స్కిట్స్‌లో ఆయన చేసిన పాత్రలు బాగా హిట్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆయనకు జబర్దస్త్ షోలు చేయటం మానేశారు. దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడటమేనని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దయ వల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పుకొచ్చారు.'ప్రభుత్వ ఉద్యోగం నాకు సెంటిమెంట్. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పని చేసిన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానని మహానుభావుడు కేసీఆర్ గారు ప్రకటించారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా కళాకారుడిని గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా అది ఆ క్షణానికే. కానీ ఉద్యోగభృతిని కల్పించి గౌరవస్థానాన్ని కల్పించిన ప్రజా ప్రతినిధులు ఎవరూ లేరు ఒక్క కేసీఆర్ తప్ప. కేసీఆర్ గారి వల్లే నాకు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే కదా. కళ అనేది గొప్పదే కావొచ్చు కానీ.. రానున్న రోజుల్లో సినిమాలకే దిక్కులేని పరిస్థితి ఉండబోతుంది. సోషల్ మీడియా ప్రభావంతో ప్రతి ఒక్కరూ ఆర్టిస్టుగా, సెలబ్రెటీగా మారిపోతున్నారు. స్థిరమైన భృతి ఉంటది కదా అనే ఉద్దేశ్యంతో నా భార్య సలహా మేరకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరా. కరోనా టైంలో టీవీ షోలు, ఈవెంట్లు అన్నీ బంద్ అయ్యాయి. ఆ సమయంలో నాకున్న ప్రభుత్వ ఉద్యోగమే నన్ను కాపాడింది. నా కడుపు నింపింది. తిండి లేని సమయంలో ప్రభుత్వ ఉద్యోగం ఆదుకుంది. ఉద్యోగాలు లేక చాలా మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది వచ్చిన ఉద్యోగాన్ని ఎలా కాదనుకుంటాం. ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారుడిగా పని చేస్తున్నాను. సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన సదస్సులను పాట, ఆట రూపంలో ప్రజలకు తెలియజేస్తాం. ఇది కూడా గొప్ప కళ. సమాజానికి ఉపయోగపడే ఉద్యోగం మాది. ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ప్రజలకు తెలియజేస్తాం.' అని రాజమౌళి వెల్లడించారు.