Date : 28 October 2026
Posted By : RVI

నాసిరకం వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం!

నాసిరకం వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం!

విక్రమ్ ట్రేడర్స్ ఎదుట రైతుల ఆందోళన
పరకాల, నాసిరకం వరి విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయామని ఆరోపిస్తూ రైతులు బుధవారం హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని విక్రమ్ ట్రేడర్స్ ఎదుట ఆందోళన నిర్వహించారు. శాయంపేట మండలానికి చెందిన రైతులు సుమారు 150 ఎకరాల్లో డబ్ల్యూజీఎల్ సిద్ధి రకం వరిని సాగు చేశారు.

ఎకరానికి దాదాపు రూ.50 వేల పెట్టుబడి పెట్టినా, పంటకు ఇప్పటివరకు గొలుసు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన దిగుబడి వస్తుందనే ఆశతో సాగు చేపడితే నష్టాలు మిగిలాయని వాపోయారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, నష్టానికి గల కారణాలను గుర్తించాలని రైతులు డిమాండ్ చేశారు. బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని కోరారు.