- ముగ్గురు నిందితుల అరెస్ట్.. కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం
- రెండు రోజుల్లో మూడు కేసులు..
- రూ.10 లక్షల విలువైన మాదకద్రవ్యాలు పట్టివేత
సంగారెడ్డి, : గోవా నుంచి హైదరాబాద్కు మాదకద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్న ముఠాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, సంగారెడ్డి జిల్లా టాస్క్ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి కొకైన్, ఎండీఎంఏతో పాటు డ్రగ్స్ రవాణాకు ఉపయోగించిన కారును, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 7.30 గంటలకు సదాశివపేట సమీపంలోని వెంకటాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 15 గ్రాముల కొకైన్, 1.5 గ్రాముల ఎండీఎంఏ లభించాయి. డ్రగ్స్ రవాణాకు వినియోగించిన మారుతి ఎర్టిగా కారుతో పాటు ఏడు సెల్ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు.
సంగారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం మూడు కేసులు నమోదు చేసి, ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 150 గ్రాముల గంజాయి, 65 గంజాయి మొక్కలు, 15 గ్రాముల కొకైన్, 1.5 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మాదకద్రవ్యాల రవాణాకు ఉపయోగించిన ఒక కారుతో పాటు ఏడు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్, ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.