ఎల్‌నినో ప్రభావాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిల్వల్లేవని కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. బియ్యం ధరలు అమాంతం పెంచుతున్నారు. కొందరు మిల్లర్లు, ట్రేడర్ల ఆగడాలతో పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ప్రస్తుత మార్కెట్లో బియ్యం కొనలేం, తినలేం అన్నట్లు మారింది పరిస్థితి. రోజురోజుకూ ధరలు పెరిగిపోతున్నాయి. ఎల్‌నినో కారణాంగా బియ్యం నిల్వలు లేవంటూ ఈసారి ధ్యానం దిగుబడులు సరిగా రాలేదంటూ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
కొందరు వ్యాపారులు, దళారులు బియ్యం సంచుల రంగులతో మాయ చేస్తున్నారు. పైన బ్రాండ్ మారుతున్నా లోపల బియ్యం ఒకటే. దొడ్డురకం, రేషన్ బియ్యాన్ని సేకరించి పాలిష్ పట్టి వివిధ రకాల బ్రాండ్ల పేరిట, ఆకర్షణీయమైన రంగుల సంచులకు కొత్త స్టిక్కర్ అతికించి నింపుతున్నారు. ఇలా బియ్యం వ్యాపారంలో సాగుతున్న ఇలాంటి అక్రమాలెన్నో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్, తూనికలు-కొలతలు, రాష్ట్ర జీఎస్టీ, పోలీసు అధికారుల తనిఖీలలో వెలుగులోకి వస్తున్నాయి.
తనిఖీలలో లెక్కలేనన్ని అక్రమాలు
గురు, శుక్రవారాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బియ్యం హోల్‌సేల్, రిటైల్ షాపులపై ఆయా విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా కర్మన్‌ఘాట్, బేగంబజార్, నాంపల్లి, మహరాజ్‌గంజ్, అమీర్‌పేట, మలక్‌పేట, శ్రీనగర్‌కాలనీ, మంగళ్‌హాట్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీలలో లెక్కలేనన్ని అక్రమాలు వెలుగుచూశాయి.
- కొందరు వ్యాపారులు అటు ప్రభుత్వానికి పన్ను ఎగవేయంతో పాటు వినియోగదారులకు కిలో, రెండు కిలోల బియ్యం తక్కువగా ఇస్తూ మోసం చేస్తున్నారు. కర్మన్‌ఘాట్‌లోని ఓ బియ్యం దుకాణంలో 26 కిలోలుగా ముద్రించిన బస్తాను అధికారులు పరిశీలించగా 24 కిలోలే ఉంది. అదేవిధంగా మరో దుకాణంలో 25 కిలోలే ఉంది. సాధారణంగా 25 కిలోల వరకూ జీఎస్టీ 5 శాతం చెల్లించాలి. అందుకే స్టోర్ల నుంచి మొదలు పెడితే హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో బియ్యం బస్తాలను 26 కిలోల పేరుతో విక్రయిస్తూ పన్ను ఎగవేస్తున్నారు. తూకమైనా సరిగా ఇస్తున్నారా అంటే అదీ లేదని విజిలెన్స్ ఉన్నతాధికారి శశిధర్‌రాజు ఈనాడు-ఈటీవీ భారత్‌కు తెలిపారు.
- ఒకే రకమైన బియ్యాన్ని వేర్వేరు బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నట్లు తనిఖీలలో గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఇబ్రహీంపట్నంలో ఓ రైస్‌మిల్లులో రేషన్ బియ్యం దొరికాయి. వాటిని మూడు బ్రాండ్ల పేర్లు ఉన్న బస్తాల్లో నింపి ఉండటాన్ని గుర్తించారు. మొత్తం 400 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నా కూడా అదే తరహా అక్రమాలు కర్మన్ఘట్లోని దుకాణాల్లోనూ జరుగుతున్నట్లు గమనించాం. గురువారం స్వాధీనం చేసుకున్న బియ్యం నమూనాల్ని పరీక్షలకు పంపించామని అధికారులకు వెల్లడించారు.
ట్రేడ్ లైసెన్సులు లేని దుకాణాలు గుర్తింపు
ఇలా అనేక దుకాణాల్లో ఇదేవిధంగా కొనసాగుతున్నట్లు, పలు దుకాణాల్లో వందల బస్తాల బియ్యం అక్రమ నిల్వలు ఉన్నట్లు తేల్చారు. బియ్యం ఎక్కణ్నుంచి కొనుగోలు చేశారు? ఏ మిల్లులో మరాడించారు? ఎంత ధరకు తెచ్చారు? వంటి వివరాలకు సంబంధించిన బిల్లులు పలు దుకాణాల్లో లేవని నిర్ధారించారు. ట్రేడ్ లైసెన్సులు కూడా లేకుండా వ్యాపారం చేస్తున్న దుకాణాలనూ గుర్తించారు.