యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ కరెన్సీ తయారీ నేర్చుకున్న ఓ వ్యక్తి.. హైదరాబాద్ శివార్లలో భారీ నకిలీ నోట్ల రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుంట్లూరులో ఏర్పాటు చేసిన రహస్య తయారీ కేంద్రంపై దాడి చేసి రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో వాహన తనిఖీల సందర్భంగా మొదట రూ.8 లక్షల నకిలీ నోట్లు పట్టుబడటంతో ఈ వ్యవహారం బయటపడింది. నకిలీ పోలీసుల వేషంలో బాధితులను బెదిరించి అసలు డబ్బు దోచుకున్నట్లు కూడా విచారణలో వెల్లడైంది. నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.సినిమాల్లో చూసే నకిలీ కరెన్సీ దందాను నిజ జీవితంలో అమలు చేశాడో వ్యక్తి. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వీడియోలను చూసి నకిలీ నోట్లు ముద్రించడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా ఓ ఇంటినే నకిలీ కరెన్సీ తయారీ కేంద్రంగా మార్చేశాడు. చివరికి పోలీసుల తనిఖీల్లో నకిలీ నోట్లు పట్టుబడటంతో.. ఈ భారీ ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో పోలీసులు రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నకిలీ కరెన్సీ రాకెట్ బయటపడింది. ఈనెల 1వ తేదీన హైదరాబాద విజయవాడ జాతీయ రహదారిపై రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ కారును అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా రూ.8 లక్షల విలువైన నకిలీ కరెన్సీ బయటపడింది. దీంతో కారులో ఉన్న ఎం. కరుణాకర్, సీహెచ్. మాణిక్యరెడ్డి, సీహెచ్. రత్నాకర్‌రెడ్డి, కె. అజయ్కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.