హైదరాబాద్ నగరం నుంచి దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడంతోపాటు ప్రైవేటు బస్సుల నుంచి ఎదురవుతున్న పోటీని అధిగమించేందుకు ఎంపిక చేసిన బస్సు సర్వీసుల్లో ప్రత్యేక రాయితీ ఛార్జీలను ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయంతో మైసూరు, బెంగళూరు, విజయవాడ, గుంటూరు మార్గాల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరల భారం తగ్గనుంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి నడిచే నాలుగు మార్గాలకు చెందిన ఎంపిక చేసిన సర్వీసుల్లో ఈ రాయితీలు అందుబాటులో ఉంటాయని రంగారెడ్డి రీజియన్ ప్రాంతీయ మేనేజర్ వి.శ్రీదేవి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలతో పోటీని తట్టుకుంటూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడం, తద్వారా సంస్థ ఆదాయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ, వివిధ మార్గాల్లో ప్రైవేటు బస్సుల ఛార్జీలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ధరలను నిర్ణయించినట్లు వివరించారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే ఈ రాయితీల ఉద్దేశమన్నారు.
బీహెచ్ఈఎల్ డిపో నుంచి మైసూరు, బెంగళూరు, విజయవాడ, గుంటూరు మార్గాల్లో నడిచే ఎంపిక చేసిన సర్వీసులకు తగ్గింపు ధరలు వర్తించనున్నాయి. మైసూరు ఏసీ స్లీపర్ బస్సులో ప్రస్తుతం రూ.2,420గా ఉన్న టికెట్ ధరను రూ.1,800కు తగ్గించారు. అంటే ప్రయాణికులకు రూ.620 ఆదా కానుంది. బెంగళూరు ఏసీ స్లీపర్ సర్వీసులో ప్రస్తుత రూ.1,440 ఛార్జీని రూ.1,200కు పరిమితం చేశారు. దీంతో ఒక్కో టికెట్‌పై రూ.240 వరకు తగ్గింపు లభిస్తుంది.
అదేవిధంగా విజయవాడ మార్గంలో నడిచే రాజధాని బస్సు టికెట్ ధరను రూ.650 నుంచి రూ.500కు తగ్గించారు. ఈ సర్వీసులో ప్రయాణించే వారికి రూ.150 మేర ప్రయోజనం కలగనుంది. గుంటూరు మార్గంలో నడిచే సూపర్ లగ్జరీ బస్సు ఛార్జీని రూ.530 నుంచి రూ.450కు తగ్గించారు. దీంతో ప్రయాణికులకు రూ.80 ఆదా అవుతుంది. ఆయా మార్గాల్లో అప్ అండ్ డౌన్ సర్వీసులకు సంబంధించి ఈ ప్రత్యేక రాయితీ ధరలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.