Date : 06 November 2026
Posted By : RVI

తెలంగాణలో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌లు.. మారుతీ సుజుకీ బిగ్ స్టెప్.. ఎలా పని చేస్తాయో తెలుసా?

తెలంగాణలో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌లు.. మారుతీ సుజుకీ బిగ్ స్టెప్.. ఎలా పని చేస్తాయో తెలుసా?

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖతో (Telangana Transport Department) ఒక కీలకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు, పారదర్శకతను పెంచేందుకు 6 వేర వేరు ప్రాంతాలలో మొత్తం 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్స్ (ADTT) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రోడ్డు భద్రతను పెంపొందించే దిశగా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. అసలు ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ అంటే ఏంటి? ఇవి ఎలా పని చేస్తాయి? ఇందులో మారుతీ సుజుకీ పాత్ర ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.

తెలంగాణలో మొత్తం 12 ట్రాక్స్ ఏర్పాటు

మారుతీ సుజుకీ తెలంగాణ రవాణా శాఖ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని 6 ఆర్‌టీఓ కేంద్రాల పరిధిలో ఈ 12 అధునాత ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్స్ అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, కొండాపూర్‌లో ఏర్పాటు చేస్తారు. ఇక మేడ్చల్ జిల్లాలో ఉప్పల్, మేడ్చల్, నాగోల్‌లో ఏర్పాటు చేస్తారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ ఆర్‌టీవో కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు.



ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్ అంటే ఏంటి?

సంప్రదాయ పద్ధతిలో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష రాసేటప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ ప్రత్యక్షంగా పక్కనే ఉండి అభ్యర్థి డ్రైవింగ్‌ను పరిశీలించి పాస్ లేదా ఫెయిల్ అని నిర్ణయిస్తారు. దీనివల్ల మానవ తప్పిదాలకు లేదా పక్షపాతానికి అవకాశం ఉండేది. అయితే, ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్ అనేది మానవ ప్రమేయం లేకుండా కేవలం హై-టెక్ సెన్సార్లు, కెమెరాలు, కంప్యూటర్ అల్గారీథమ్స్ ఆధారంగా డ్రైవింగ్ సామర్థ్యాన్ని అంచనా వేసే డిజిటల్ సిస్టమ్. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ నిబంధనలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్స్ ఎలా పని చేస్తాయి?

ఆటోమేటెడ్ ట్రాక్‌లో పరీక్ష రాసేటప్పుడు మొత్తం ప్రాసెస్ డిజిటల్ గా సాగుతుంది. ట్రాక్ చుట్టూ అత్యంత కచ్చితత్వంతో పని చేసే 4K, HD కెమెరాలు, సబ్‌సర్ఫేస్ సెన్సార్లు ఉంటాయి. వాహనానికి ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్ అమర్చుతారు. టూ-వీలర్ పరీక్షల కోసం 8 ఆకారం ట్రాక్, సర్పెంటైన్ ట్రాక్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, అప్‌హిల్ ర్యాంప్ రైడింగ్ ఉంటుంది. 4-వీలర్ పరీక్షలకు H ట్రాక్ (రివర్స్, ఫార్వర్డ్ పారలల్ పార్కింగ్), S ఆకారం ట్రాక్, ఘాట్, ర్యాంప్ నియంత్రణ టెస్ట్ ఉంటాయి.డ్రైవర్ సరిహద్దు గీతను తాకినా, ఇండికేటర్ వేయడం మర్చిపోయినా, లేదా నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నా సెన్సార్లు క్షణాల్లో గుర్తించి కంప్యూటర్ సర్వర్ డేటాను పంపుతాయి. పరీక్ష పూర్తయిన వెంటనే అభ్యర్థి ఎన్ని పాయింట్లు సాధించారు, ఎక్కడ తప్పు చేశారు అనే ప్రదర్శన నివేదిక ప్రత్యక్షం అవుతుంది. కనీస అర్హత పాయింట్లు దాటితే కంప్యూటరే ఆటోమేటిక్‌గా PASS అని నిర్ధారించి లైసెన్స్ మంజూరుకు అనుమతిస్తుంది.


ఈ ప్రాజెక్టులో మారుతీ సుజుకీ పని ఏమిటి?దేశంలో అత్యధిక కార్లు విక్రయించే మారుతీ సుజుకీ కేవలం కార్ల ఉత్పత్తికే పరిమితం కాకుండా రోడ్డు భద్రత మెరుగుపరచడాన్ని తమ సామాజిక బాధ్యతగా స్వీకరించింది. తెలంగాణలో 12 ఆటోమేటెడ్ ట్రాక్స్ సరికొత్త ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విజువల్స్, టెస్టింగ్ సిస్టమ్స్ తో మారుతీ సుజుకీ సొంత వ్యయంతో నిర్మించి ఇస్తుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే 12తో కలిపి దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 98 వరకు ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసింది. అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 8 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్, 19 రోడ్ సేఫ్టీ నాలెడ్జ్ సెంటర్లను కూడా నిర్వహిస్తోంది.