Date : 06 November 2026
Posted By : RVI

రాష్ట్ర వ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్.. టాప్‌లో నిలిచిన విశాఖ, మరి లాస్ట్‌లో ఏ జిల్లా ఉందంటే?

రాష్ట్ర వ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్.. టాప్‌లో నిలిచిన విశాఖ, మరి లాస్ట్‌లో ఏ జిల్లా ఉందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలిగ్ జరిగింది. ఈ పోలింగ్ సమయంలో కొన్ని జిల్లాలో అనూహ్య ఘటనలు కూడా జరిగాయి. అయినా గ్రామీణ ఓటర్లు తమ స్థానిక నాయకులను ఎన్నుకోవడానికి ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు బారులు తీరారు. ఈ పరిషత్‌ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 70.72 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా తెలియజేసింది.

టాప్‌లో విశాఖ.. డీలా పడ్డ ఏజెన్సీ...

ఓటింగ్ విషయంలో విశాఖపట్నం జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలోనే మరెక్కడా లేనివిధంగా విశాఖ జిల్లా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏకంగా 82.51 శాతం భారీ ఓటింగ్‌తో రాష్ట్రంలోనే విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక చిత్తూరు, విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలు సైతం పోలింగ్‌లో చురుగ్గా పాల్గొనడంతో అక్కడ కూడా ఓటింగ్ 75 శాతం క్రాస్ చేయడం జరిగింది.



అయితే ఓటింగ్ విషయంలో అల్లూరి జిల్లా ప్రజలు పెద్ద ఆసక్తి చూపలేదని అర్థమవుతుంది. ఓటింగ్ గణాంకాలను పరిశీలిస్తే లీస్ట్‌లో అల్లూరి జిల్లానే ఉంది. ఇక్కడ అత్యల్ప ఓటింగ్ నమోదైంది. ఇక్కడ కేవలం 62.01 శాతం మాత్రమే ఓటింగ్ నమోదై, ఆ జిల్లా జాబితాలో లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత అనంతపురం 64.38 శాతం, పోలవరంలో 65.48 శాతంతో అట్టడుగున నిలిచాయి.

ఏ జిల్లాలో ఎంత పోలింగ్ నమోదైందంటే?

ఇక చిత్తూరు 76.30 శాతంతో సెకండ్ ప్లేస్‌లో నిలబడగా, 76.21 శాతంతో విజయనగరం మూడో ప్లేస్‌లో ఉంది. అనకాపల్లిలో 75.58 శాతం, ఎన్టీఆర్‌ జిల్లాలో 75.53 శాతం, ఏలూరు 75.52 శాతం, నంద్యాల 74.27 శాతం, సత్యసాయి 73.71 శాతం, కృష్ణా 73.21 శాతం, గుంటూరు 73.12 శాతం, కడప 71.78 శాతం, తూర్పుగోదావరి జిల్లా 71.56 శాతం, పల్నాడులో 70.93 శాతం, నెల్లూరు జిల్లాలో 70.62 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 69.73 శాతం, అన్నమయ్య జిల్లాలో 69.19 శాతం, కాకినాడ జిల్లాలో 68.94 శాతం, తిరుపతిలో 68.67 శాతం, ప్రకాశం జిల్లాలో 68.53 శాతం, కర్నూలు జిల్లాలో 68.29 శాతం, మార్కాపురం జిల్లాలో 67.69 శాతం, బాపట్ల జిల్లాలో 67.47 శాతం, పార్వతీపురం జిల్లాలో 67.13 శాతం, కోనసీమ జిల్లాలో 66.33 శాతం, అలాగే శ్రీకాకుళం జిల్లా 65.51 శాతం, పోలవరం జిల్లాలో 65.48 శాతం, అనంతపురం జిల్లాలో 64.38 శాతం, అల్లూరి జిల్లాలో 62.01 శాతం పోలింగ్ నమోదైంది.