Date : 06 November 2026
Posted By : RVI

రాప్తాడు ఘటన.. స్నేహం కోసం ప్రాణాలకు తెగించిన లక్ష్మి.. బాలికకు ఆనంద్ మహీంద్రా అండ

రాప్తాడు ఘటన.. స్నేహం కోసం ప్రాణాలకు తెగించిన లక్ష్మి.. బాలికకు ఆనంద్ మహీంద్రా అండ

అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. హేమంత్ అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలోకి ఎలక్ట్రిక్ రంపంతో చొరబడి అందరూ చూస్తుండగానే గోపిక అనే విద్యార్థిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఆ దృశ్యం చూసి అందరూ అక్కడ నుంచి పరుగులు తీశారు. కానీ, ఓ చిన్నారి మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. తన కళ్ల ముందే స్నేహితురాలి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. దాడి చేస్తున్న వ్యక్తిని ఆపడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. అయినా సరే తన క్లాస్‌మేట్‌ని మృత్యుముఖం నుంచి లాక్కొచ్చింది. మానవత్వానికి, సాహసానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆ బాలిక లక్ష్మీ ధైర్యానికి ఇప్పుడు అందరూ సలాం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఆ బాలిక తెగువను, ధైర్యాన్ని మెచ్చి.. ఆమెకు అండగా నిలిచారు.

రాప్తాడులోని క్లాస్‌రూమ్‌లో జరిగిన ఆ దారుణ ఘటనలో గాయపడిన ఇద్దరు బాలికలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో లక్ష్మి చూపిన తెగువ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఈ బాలిక ధైర్యంపై ఎంత అసాధారణమైన యువతి అంటూ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. "భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మనం తరచుగా యువత వైపు చూస్తుంటాం. కానీ ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, పైగా తన గురించి తాను భయపడే దానికంటే, మరొక వ్యక్తి పట్ల చూపే శ్రద్ధ లేదా ఆందోళన అధికమయ్యే క్షణమే నిజమైన ధైర్యం. ఎంత అసాధారణమైన యువతి." అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు.