Date : 09 November 2026
Posted By : RVI

అండాల అక్రమ సేకరణపై మహిళా కమిషన్ సీరియస్.. ఫెర్టిలిటీ కేంద్రాల రికార్డులపై ఆరా

అండాల అక్రమ సేకరణపై మహిళా కమిషన్ సీరియస్.. ఫెర్టిలిటీ కేంద్రాల రికార్డులపై ఆరా తెలంగాణలో కలకలం రేపిన అండాల అక్రమ సేకరణ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయడంతోపాటు విస్తృత స్థాయిలో విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు ప్రముఖ ఫెర్టిలిటీ కేంద్రాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అండాల సేకరణ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలు పాటించారా? మహిళల ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

మహిళా కమిషన్ నోటీసుల మేరకు సంబంధిత ఐదు ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు కమిషన్ ఎదుట హాజరయ్యారు. తమ ఆసుపత్రుల్లో అండాల సేకరణ ఎలా నిర్వహించారు, ఇందుకు అనుసరించిన విధానాలు ఏమిటి, రోగులకు సంబంధించిన వివరాలు, ఇతర సాంకేతిక సమాచారాన్ని అధికారులకు అందజేశారు. ఈ వివరాల ఆధారంగా కమిషన్ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు సమర్పించిన నివేదికలతోపాటు ఆయా ఆసుపత్రులకు సంబంధించిన రికార్డులను మహిళా కమిషన్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అండాల సేకరణకు సంబంధించి నిర్దేశించిన చట్టపరమైన నిబంధనలు పాటించారా? మహిళల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నారా? వైద్యపరమైన భద్రతా ప్రమాణాలను అనుసరించారా? అనే అంశాలపై దృష్టి సారించారు. మహిళలను మోసగించి లేదా వారి అంగీకారం లేకుండా అండాల సేకరణకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

అండాల సేకరణ ప్రక్రియలో మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపే వైద్యపరమైన అంశాలు ఉండటంతో ఈ వ్యవహారాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా బాధిత మహిళలకు ఎదురైన ఇబ్బందులు, వారి ఆరోగ్య భద్రత, ఆసుపత్రులు అనుసరించిన విధానాలపై సమగ్ర వివరాలు సేకరిస్తోంది. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మహిళల హక్కులు, ఆరోగ్య భద్రతకు భంగం కలగకుండా చూడటమే లక్ష్యంగా విచారణ చేపట్టినట్లు మహిళా కమిషన్ స్పష్టం చేసింది. బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాల రికార్డుల పరిశీలన పూర్తయిన తర్వాత ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.