మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది.రెండు కేసుల్లో చార్జిషీట్లు త్వరగా దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఎస్‌ఐ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల ఇదే పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ, మరో ఎస్‌ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి అరెస్ట్ కావడం.. ఆ సమయంలో స్థానికులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో ఎస్‌ఐ ఏసీబీ వలలో చిక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైన భూ మోసం, 498ఏ కేసుల్లో ఓ వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. ఈ 2 కేసులకు సంబంధించి త్వరగా చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆయన ఎస్‌ఐ శ్రీనివాస్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే చార్జిషీట్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని ఎస్‌ఐ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లేదంటే చార్జిషీట్లు దాఖలు చేయడంలో జాప్యం జరుగుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో లంచం డిమాండ్‌తో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదుపై స్పందించిన అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేశారు. సోమవారం కీసర పరిధిలోని శిల్పా లేఅవుట్ ప్రాంతంలో బాధితుడి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నగదును స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇదే స్టేషన్‌కు చెందిన సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్ విషయంలో సీఐ ఆంజనేయులు బాధితుడి నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రూ.5 లక్షలను ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి ద్వారా తీసుకునేలా వ్యవహరించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారంతో డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కీసర చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం విధుల్లో ఉన్న ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి వద్ద నుంచి రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.