హైదరాబాద్ నగర ప్రజలకు మరో గండం పొంచి ఉంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులకు ఇప్పుడు తాగునీటి కొరత భయం పట్టుకుంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట వంటి ప్రాంతాల్లో డిసెంబర్ నుంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండటంతో సరఫరా, డిమాండ్ మధ్య భారీ అంతరం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ( HMWSSB ) అంచనా వేస్తోంది.
పటాన్చెరు నుంచి నార్సింగి వరకు విస్తరించిన పశ్చిమ హైదరాబాద్ కారిడార్లో మూడు లక్షలకు పైగా నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సింగూరు, మంజీరా జలాశయాల నుంచి ప్రధానంగా తాగునీరు సరఫరా అవుతోంది. అయితే జలాశయాల్లో నిల్వలు తగ్గుతుండటంతో రోజుకు సుమారు 100 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని వాటర్బోర్డు అంచనా వేసినట్లు సమాచారం. మరోవైపు ప్రత్యామ్నాయంగా వినియోగించే భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.
పశ్చిమ హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా భారీ సంఖ్యలో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు వెలిశాయి. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, ఖాజాగూడ, కొండాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, నల్లగండ్ల, తెల్లాపూర్ ప్రాంతాల్లో 150కి పైగా భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు 20 నుంచి 40 అంతస్తుల టవర్లు ఉండగా.. ఒక్కో అపార్ట్మెంట్ సముదాయంలో వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇలాంటి చోట్ల పైపుల ద్వారా వచ్చే నీటి సరఫరాలో స్వల్ప తగ్గుదల ఏర్పడినా రోజువారీ అవసరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.