హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్యం వణికిస్తోంది. ఒకప్పుడు స్వచ్ఛమైన వాతావరణానికి పేరొందిన నగరం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీని తలపించేలా హైదరాబాద్‌లోనూ గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని పలు ప్రాంతాలు కాలుష్య హాట్స్పాట్లుగా మారుతున్నాయి. శేరిలింగంపల్లి, మణికొండ, గచ్చిబౌలి పరిసరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.
అందుబాటులో ఉన్న కాలుష్య గణాంకాల ప్రకారం హైదరాబాద్ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 410గా నమోదైంది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య పరిస్థితిని సూచిస్తోంది. సాధారణంగా పీఎం 2.5కు సూచించిన సురక్షిత పరిమితి 60 మైక్రోగ్రాములు కాగా.. ప్రస్తుతం 278 మైక్రోగ్రాములకు చేరింది. అలాగే పీఎం 10 సురక్షిత పరిమితి 100 మైక్రోగ్రాములు కాగా.. 326 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఈ స్థాయిలో సూక్ష్మ ధూళి కణాలు గాలిలో ఉండటం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే డిఫెన్స్ కాలనీలో ఏకంగా 685 AQI నమోదైంది. శేరిలింగంపల్లిలో 666, మణికొండలో 602, యాంబియన్స్ ఫోర్ట్‌లో 596, ఎన్బీటీ నగర్లో 582గా కాలుష్య సూచీ నమోదైంది. ముఖ్యంగా ఐటీ సంస్థలు, భారీ నిర్మాణాలు, నిరంతర వాహన రాకపోకలు ఎక్కువగా ఉండే పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్ రద్దీ, నిర్మాణ కార్యకలాపాల నుంచి వెలువడే దుమ్ము, వాహనాల పొగ, పారిశ్రామిక ఉద్గారాలు గాలి నాణ్యతపై ప్రభావం చూపే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.