హైదరాబాద్‌లో పాత ఇళ్ల పునర్నిర్మాణానికి భవన నిర్మాణ నిబంధనలు అడ్డంకిగా మారాయి. దాదాపు 14 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన 20 అడుగుల ప్లాట్ వెడల్పు నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం బిల్డ్‌నౌ సాఫ్ట్వేర్ ద్వారా కఠినంగా అమలు చేయడంతో చిన్న స్థలాల యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీతో పాటు హైదరాబాద్ నగరంలోని పాత కాలనీల్లో ఈ నిబంధన ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఇళ్లను పునర్నిర్మించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో జీవో 168ను జారీ చేసింది.
దీని ప్రకారం నివాస స్థలానికి రహదారి వైపు కనీసం 20 అడుగుల వెడల్పు ఉండాలి. అంతకంటే తక్కువ వెడల్పు ఉన్న స్థలాల్లో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయకూడదనే నిబంధనను ఇందులో పొందుపరిచారు. భవనాల ఎత్తు, రహదారుల వెడల్పు, సెట్బ్యాక్లు వంటి అంశాలనూ ఈ నిబంధనలు నియంత్రిస్తాయి. అయితే ఈ నిబంధన దాదాపు 14 ఏళ్లుగా అమల్లో ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు గతంలో అంత కఠినంగా అమలు చేయలేదు. చిన్న స్థలాల్లోనూ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేవారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో భవనాలు కూలిన ఘటనలు చోటుచేసుకోవడంతో భద్రతా అంశాలపై అధికారులు దృష్టి సారించారు. దీంతో బిల్డ్‌నౌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి.. రహదారికి ఎదురుగా 20 అడుగుల కంటే తక్కువ వెడల్పు ఉన్న స్థలాల దరఖాస్తులను ఆటోమేటిక్‌గా తిరస్కరించే విధంగా రూపొందించారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ పాతబస్తీ, పాత నివాస ప్రాంతాల్లోని చిన్న స్థలాల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ చాలా ఇళ్లు దశాబ్దాల క్రితమే 60 నుంచి 70 చదరపు గజాలు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించారు.
వీటిలో అనేక స్థలాలకు రహదారి వైపు 20 అడుగుల కంటే తక్కువ వెడల్పు ఉంది. పాత ఇళ్లను కూల్చి తిరిగి నిర్మించుకోవాలనుకున్నా సాఫ్ట్వేర్ దరఖాస్తులను స్వీకరించకపోవడంతో యజమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిబంధన వల్ల పెద్ద స్థలాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని మధ్యతరగతి, పేద కుటుంబాలే ఎక్కువగా నష్టపోతాయని రియల్టర్లు వాదిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇళ్లను పునర్నిర్మించుకునే విషయంలోనూ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.మరోవైపు.. చిన్న స్థలాల్లో నిర్మాణాలను నియంత్రించడం పట్టణ ప్రణాళికలో భాగమని అధికారులు చెబుతున్నారు. పెద్ద స్థలాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి నిర్మాణాలు చేపట్టడం వల్ల నగర అభివృద్ధి అస్తవ్యస్తంగా మారుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు 200 చదరపు మీటర్లకు మించిన స్థలాలకు వర్తించే తనఖా నిబంధనను తప్పించుకునేందుకు ప్లాట్లను చిన్నవిగా విభజిస్తున్నాయని మున్సిపల్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
చాలా ఇరుకైన స్థలాల్లో ఇళ్లు నిర్మించడం వల్ల గదుల పరిమాణం.. గాలి, వెలుతురు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో సమస్యలు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. ఇరుకైన వీధులు, నడిచేందుకు తగిన స్థలం లేకపోవడం, భవన భద్రతకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతాయని వివరిస్తున్నారు. నిబంధన అమలుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం బిల్డ్‌నౌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు 20 అడుగుల కంటే తక్కువ వెడల్పు ఉన్న స్థలాలకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ సిటీ ప్లానర్ కె. ప్రదీప్ కుమార్ వెల్లడించారు.