కార్తిక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచే ఈ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి డిసెంబరు 8 వరకు ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో బస్సులో 40 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా సోమవారాల్లో శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాత్రల్లో భాగంగా శబరిమలతో పాటు కీసరగుట్ట, అనంతగిరి హిల్స్, ముచ్చింతల, యాదాద్రి, సోమశిల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. కుటుంబ సభ్యులు, భక్తుల బృందాలు కలిసి సౌకర్యవంతంగా యాత్ర చేసేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేసినట్లు సంస్థ వెల్లడించింది.
భక్తులు ఒకే యాత్రలో పలు ఆలయాలను సందర్శించేలా ఆర్టీసీ ప్రత్యేక సర్క్యూట్లను రూపొందించింది. కరీంనగర్ సర్క్యూట్లో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కొమురవెల్లి మల్లన్న ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను చేర్చారు. వరంగల్ సర్క్యూట్లో కాళేశ్వరం, వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం, ఇనవోలు మల్లికార్జునస్వామి ఆలయం, లక్నవరం ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించారు.
శ్రీశైలం సర్క్యూట్లో శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం, ఉమామహేశ్వరం, సోమశిల, కందూరు, జోగులాంబ గద్వాల క్షేత్రాలను కలిపారు. దీంతో శివక్షేత్రాలతో పాటు ప్రముఖ శక్తిపీఠాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈ ప్యాకేజీలు ఉపయోగపడనున్నాయి.పంచారామాల యాత్రకు కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అన్నవరం, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి ప్రాంతాలను కలుపుతూ ప్యాకేజీలు అందుబాటులో ఉంచింది. అదేవిధంగా తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలం క్షేత్రానికి, కర్ణాటకలోని హంపి, మురుడేశ్వర్ పుణ్యక్షేత్రాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. కార్తిక మాసంలో భక్తుల ఆధ్యాత్మిక యాత్రలకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు, ఒకే ప్రయాణంలో పలు క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించడమే ఈ ప్రత్యేక బస్సుల లక్ష్యం. నగరంలోని కాలనీల నుంచే బస్సులు అందుబాటులో ఉండటంతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయి. భక్తులు తమ ప్రాంతానికి సంబంధించిన ఆర్టీసీ డివిజన్ అధికారులను సంప్రదించి బస్సుల వివరాలు, ప్యాకేజీలు, బుకింగ్ తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
- కూకట్పల్లి డివిజన్: 9959226148
- సికింద్రాబాద్ డివిజన్: 9959226142
- హయత్‌నగర్ డివిజన్: 9959226136
- చార్మినార్ డివిజన్: 9959226129
- జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్): 9959226160