Date : 09 November 2026
Posted By : RVI

అప్పుల బాధలు తీర్చే మీసాల రామయ్య! - 800 ఏళ్ల అరుదైన ఈ ఆలయ విశేషాలివే!

 అప్పుల బాధలు తీర్చే మీసాల రామయ్య! - 800 ఏళ్ల అరుదైన ఈ ఆలయ విశేషాలివే!

శ్రీరాముడిని లోకమంతా శాంతస్వరూపుడిగాను, కోమల రూపుడిగా చూస్తుంది. కానీ, హైదరాబాద్‌లో ఓ చోట శ్రీరాముడు వీరత్వానికి ప్రతీకగా ముఖంపై గంభీరమైన మీసాలతో దర్శనమిస్తాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. 800ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో శ్రీరాముడు మీసాలతో కొలువై నేటికీ భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అంతేకాదు మీసాల రామయ్యను దర్శిస్తే అప్పుల బాధలు తొలుగుతాయని భక్తులు విశ్వాసం.

మూసీనది తీరాన లంగర్‌హౌస్ బాపూఘాట్ సమీపంలో కొలువైన అద్భుత పుణ్య క్షేత్రమే శ్రీ జానకీ సమేత విజయ రాఘవ స్వామి ఆలయం. లోకమంతా శ్రీరాముడిని కోమల స్వరూపంలో చూస్తే ఇక్కడ మాత్రం స్వామివారు రోషస్ఫరితమైన గంభీర మీసాలతో దర్శనమివ్వడం విశేషం. అందుకే ఈ ఆలయాన్ని భక్తులు మీసాల రామయ్య దేవాలయం అని పిలుచుకుంటారు.

800 ఏళ్ల ఘన చరిత్ర

మీసాల రామయ్య క్షేత్రానికి దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉంది. పురాణ గాథల ప్రకారం తహసీల్దార్ అయిన భక్త రామదాసు భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి గోల్కొండ సుల్తాన్‌ తానీషా అనుమతి లేకుండా లక్షల రూపాయల నిధులు ఉపయోగిస్తారు. దీనిపై ఆగ్రహించిన తానీషా భక్తరామదాసును గోల్కొండ కోట కారాగారంలో బందిస్తాడు. అప్పుడు భక్తరామదాసును విడిపించడానికి తానీషా కలలోకి వచ్చిన శ్రీరాముడు అప్పునంతా తీర్చుతాడు. కానీ, ఆ విధానాన్ని ఒప్పుకోని భక్త రామదాసు బందిఖానా నుంచి బయటకు వచ్చేందుకు అంగీకరించరు. అప్పుతీర్చిన వారు తన ముందుకు రావాల్సిందేనని కోరతాడు. దాంతో మీసాలతో రామోజీ, లక్ష్మోజీగా వేషం మార్చుకొని వచ్చిన శ్రీరామలక్ష్మణులు ముచికుంద నదీ తీరాన భక్త రామదాసుతో ముచ్చటిస్తారు.అప్పుడు ఇదే రూపంలో అక్కడే కొలువుదీరాలని కోరతాడు. దీంతో భక్తుడి కోరిక మేరకు శ్రీరాముడు మీసాల రామయ్యగా కొలువు దీరినట్లు ఇక్కడి పీఠాధిపతులు చెబుతున్నారు. నాటి నుంచి నేటి వరకు శ్రీరాముడు మీసాల రామయ్యగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. అంతే కాదు భక్త రామదాసు అప్పు తీర్చిన శ్రీరాముడిని దర్శించుకుంటే తమ అప్పులూ తీరతాయని భక్తుల విశ్వాసం. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యే వారు, అప్పుల బాధల్లో కూరుకుపోయిన వారు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని 21 బుధ, శని వారాల్లో దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తే అప్పుల తిప్పలు తీరతాయని భక్తుల నమ్మకం. తమ కష్టాలను మీసాల రామయ్య తీరుస్తాడనే నమ్మకమే ఇక్కడికి వేలాది మందిని నడిపిస్తోందని భక్తులు చెబుతున్నారు.