Date : 09 November 2026
Posted By : RVI

నేటితో ముగియనున్న సీఎం కొడంగల్ పర్యటన - హకీంపేటలో సాయంత్రం భారీ బహిరంగ సభ

నేటితో ముగియనున్న సీఎం కొడంగల్ పర్యటన - హకీంపేటలో సాయంత్రం భారీ బహిరంగ సభ

వికారాబాద్​ జిల్లాలోని సొంత నియోజకవర్గం కొడంగల్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ చివరి రోజు హకీంపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి వేలాది రైతులతో భారీ సభకు పార్టీ శ్రేణులు, అధికార వర్గాలు ఏర్పాట్లు చేశాయి. మూడో రోజు కూడా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

వేలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ

కొడంగల్‌లో దీపావళితో పాటు జన్మదిన వేడుకలు జరుపుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మూడో రోజు లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఎకో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. నాచారం గ్రామం నుంచి రేడియల్ రోడ్డు-2 సహా ఇతర అభివృద్ధి పనులకు సైతం శంకుస్థాపనలు చేయనున్నారు.

పర్యటనలో చివరి రోజు హకీంపేటలో వేలాది మంది రైతులతో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ మేరకు సభ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

రెండో రోజు బొమ్రాస్‌పేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, పోలీస్‌ స్టేషన్ నూతన భవనాన్ని రేవంత్‌ రెడ్డి అందుబాటులోకి తెచ్చారు. అనంతరం హకీంపేటలో పర్యటించిన సీఎం, జూనియర్ కళాశాల, స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత కొడంగల్‌ పోలీస్‌ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ప్రారంభించారు. పర్సాపూర్ గ్రామంలో సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటికి వెళ్లి దంపతులకు నూతన వస్త్రాలు బహూకరించారు.

అనంతరం వారింట్లోనే సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. హకీంపేటలో పింఛన్ల పంపిణీ, మహిళా స్వయం సహాయక బృందాలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లు పంపిణీ చేశారు. అంతకు ముందు రోజు హ‌కీంపేట‌లో వేర్వేరు కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించారు. అగ్రి ఎక్స్‌పో స్టాళ్లను పరిశీలించారు.