Date : 11 November 2026
Posted By : RVI

టీ కోసం కూడా యూపీఐతోనే చెల్లింపులు.. అయినా సర్క్యులేషన్‌లో రూ. 43 లక్షల కోట్ల నగదు ఎందుకు?

టీ కోసం కూడా యూపీఐతోనే చెల్లింపులు.. అయినా సర్క్యులేషన్‌లో రూ. 43 లక్షల కోట్ల నగదు ఎందుకు?

భారతీయుల వాలెట్లలో ఒకప్పుడు కేవలం డబ్బు మాత్రమే కనిపించేది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇంట్లో డబ్బాల్లో లేదా సీక్రెట్ ప్రదేశాల్లో కొన్ని నోట్లను దాచుకోవడం, ప్రతి వారం ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకొని రావడం సాధారణంగా ఉండేది. చిన్న ఖర్చు చేసినా ఎంత ఖర్చు చేశాం, ఎంత మిగిలిందనే లెక్కలు ఇట్టే తెలిసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ రోజుల్లో షాపుల్లో టీ తాగినా, కిరాాణా సరుకులు కొనుగోలు చేసినా, ఆటోకు డబ్బులు చెల్లించాలన్నా, బస్, ట్రైన్ టికెట్స్ ఇలా దేనికైనా యూపీఐ ద్వారానే ఎక్కువగా చెల్లింపులు చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా మంది ఒకప్పటిలా ఏటీఎంలకు కూడా వెళ్లడం లేదు. అక్కడ అంత రష్ కూడా ఉండట్లేదు. అత్యవసర నిధిని కూడా సేవింగ్స్ అకౌంట్లతో పాటు స్వీప్ ఇన్ ఎఫ్‌డీ వంటి మార్గాల్లో అందుబాటులో ఉంచుతున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇలా దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నా, నగదు చలామణి మాత్రం తగ్గడం లేదు. అంటే యూపీఐ చెల్లింపులు ఎలా జరుగుతున్నాయో, అదే స్థాయిలో నగదు ప్రవాహం కూడా ఉంది.

2016లో రూ. 17.97 లక్షల కోట్లు.. ఇప్పుడు రూ. 43 లక్షల కోట్లు

2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో దేశంలో చలామణిలో ఉన్న నగదు విలువ సుమారు రూ. 17.97 లక్షల కోట్లుగా ఉండేది. అప్పటి పెద్ద నోట్లుగా ఉన్న రూ. 500, రూ. 1000 ను కేంద్రం రద్దు చేసింది. అప్పటి నుంచి డిజిటల్ పేమెంట్స్ వేగంగా పెరిగాయి. ముఖ్యంగా యూపీఐ అందుబాటులోకి వచ్చాక చిన్న షాపుల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు డిజిటల్ పేమెంట్స్ విస్తరించాయి. అయినా కూడా ఇప్పుడు దేశంలో చలామణిలో ఉన్న నగదు విలువ రికార్డు స్థాయిలో రూ. 43 లక్షల కోట్లను దాటింది. 2016తో పోలిస్తే నగదు విలువ ఏకంగా 2.4 రెట్లు పెరిగింది.