తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో టెన్ ప్లస్ టూ (10 +2) విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విద్యాశాఖపై బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశించారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని ఉద్ఘాటించారు.
ఏ ఒక్క విద్యార్థి నష్టపోకూడదనేది తమ ఆలోచన అని సీఎం పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి టెన్ ప్లస్ టూ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్లస్ టూ నుంచి నైపుణ్యంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు ప్రాథమిక విధ్య, 5 నుంచి 8 వరకు సెకెండరీ, తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నత విద్యగా పరిగణించి ప్రత్యేక విద్యను అందించాలని ఆదేశించారు.
విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అలాగే, అద్దె భవనాల్లో సంక్షేమ హాస్టల్స్‌ను నిర్వహించకూడదని, సొంత భవనాలు ఉండాలని స్పష్టం చేశారు. అలాగే, యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణంలో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. పాలిటెక్నిక్ కోర్సుల ఆధునికీకరణకు నిధుల మంజూరు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.