కర్ణాటకలోని పారిశ్రామిక కాలుష్యం తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యాద్గిర్ జిల్లాలోని సైదాపూర్, కడేచూరు పారిశ్రామికవాడల్లోని రసాయన ఎరువుల కర్మాగారాలు, ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గాలిలో వ్యాపిస్తున్న తీవ్రమైన దుర్గంధం, వాయు కాలుష్యంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్య ఇబ్బందులతో ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు సైతం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
యాద్గిర్ జిల్లాలో సుమారు 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ పారిశ్రామికవాడలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పలు రసాయన ఎరువుల తయారీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి నుంచి వెలువడే కాలుష్యం గాలి వాలును బట్టి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో తీవ్రమైన రసాయన వాసనలు రావడంతో పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. కిటికీలు, తలుపులు మూసుకున్నా దుర్గంధం తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సరిహద్దుకు ఆనుకుని ఉన్న చేగుంట, అయినాపూర్, ఎస్కే పల్లి, కుసుమర్తి, కున్సి, ఆలంపల్లి, కొత్తపల్లి, తాళంకేరి, గురురావు లింగంపల్లి గ్రామాల ప్రజలు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం తమ గ్రామాల వరకు చేరుతోందని, ముఖ్యంగా రాత్రివేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని చెబుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు, పశువుల పెంపకంపై ఆధారపడే కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణంపైనా ప్రభావం పడుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.