కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. అప్పుడే జన్మించినట్లు భావిస్తున్న ఓ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలివెళ్లడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ చిన్నారి మృతదేహాన్ని వీధికుక్కలు పీక్కుతినడం అది చూసిన వారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ ప్రధాన రహదారి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దిందా గ్రామ పరిసరాల్లో పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుడే జన్మించిన శిశువును అక్కడ వదిలివెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మృతదేహాన్ని వీధికుక్కలు పీక్కుతిన్నట్లు గుర్తించారు. ఈ దృశ్యం చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పసికందును అక్కడ ఎవరు వదిలారు.. ఏ పరిస్థితుల్లో ఈ ఘటన జరిగింది.. అనే ప్రశ్నలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. పసికందును గర్భస్రావం అనంతరం అక్కడ పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. శిశువు ఎప్పుడు మరణించింది.. ఎవరు అక్కడ వదిలివెళ్లారు.. అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల గర్భస్రావాలు జరిగిన వివరాలను కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఆస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్ల రికార్డులను పరిశీలించే దిశగా విచారణ కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చి శిశువును అక్కడ వదిలివెళ్లారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికందు మృతదేహాన్ని రోడ్డు పక్కన వదిలివెళ్లిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు, శిశువు మరణానికి సంబంధించిన కారణాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.