తెలంగాణ హౌసింగ్ బోర్డు భూముల విక్రయాలపై వివాదం ముదురుతోంది. ఒకప్పుడు పేదలు, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు సేకరించిన బోర్డు.. ఇప్పుడు మిగిలిన ఖాళీ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వేలం వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నో ప్రాఫిట్.. నో లాస్ విధానంతో భూములు సేకరించి, ప్లాట్లు కేటాయించడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చిన సంస్థ.. ప్రస్తుతం ఆదాయం కోసం మిగిలిన స్థలాలను విక్రయించడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను సైతం అమ్మేందుకు ప్రయత్నించడంపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాది కాలంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏడో ఫేజ్‌లోని పలు ఖాళీ ప్లాట్లను రెండు విడతల్లో వేలం వేశారు. జూన్ 11న నిర్వహించిన వేలంలో ఓ ప్లాట్ చదరపు గజం రూ.2.88 లక్షల ధర పలికింది. అయితే వేలంలో ప్లాట్లు దక్కించుకున్నవారు బిడ్ మొత్తంలో 25 శాతం చెల్లించినప్పటికీ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు పూర్తికాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయలు చెల్లించిన కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం హౌసింగ్ బోర్డు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది.
వాణిజ్య అవసరాల కోసం విక్రయించే ప్లాట్లకు రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే ఆమోదిత లేఅవుట్ అవసరమనే నిబంధనలపై బోర్డు ముందుగానే స్పష్టత తీసుకుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా వేలానికి ఉంచిన ప్లాట్ల విషయంలోనూ ఆమోదిత లేఅవుట్ లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేపీహెచ్‌బీ 15వ ఫేజ్‌లో విక్రయానికి సిద్ధం చేసిన ఎల్ఐజీ, ఎంఐజీ ఓపెన్ ప్లాట్ల విషయంలోనూ కొనుగోలుదారులకు స్పష్టత కొరవడింది. గతంలో ఓ నోటిఫికేషన్లో 80 అడుగుల రహదారిని ప్రస్తావించిన బోర్డు.. ఏడాది తర్వాత మరో వేలం నోటిఫికేషన్లో 100 అడుగుల రహదారి గురించి పేర్కొన్నట్లు సమాచారం. రహదారుల వెడల్పు, లేఅవుట్ ఆమోదం, భవన నిర్మాణ అనుమతుల విషయంలో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. హెచ్‌యూడీఏ ఆమోదిత లేఅవుట్ ఉందా? ఏమైనా సవరణలు చేశారా? అన్న అంశాలపై అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదని వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసినా నిర్మాణ అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వారిలో నెలకొంది.