RRR సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి.. ప్రస్తుతం 'వారణాసి' సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఒకప్పుడు కాస్త లావుగా కనిపించే కీరవాణి.. ఇప్పుడు స్లిమ్ గా తయారయ్యారు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గారు. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించారు. కీరవాణి ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారనేది కంపేర్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
''నా ఆప్త మిత్రుడు, ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఏకంగా 22 కిలోల బరువు తగ్గారు. ఆయన పట్టుదల నిజంగా స్ఫూర్తిదాయకం. నా హైదరాబాద్ పర్యటనలో ఆయన్ని కలవడం చాలా అదృష్టంగా అనిపించింది. ఆయన ఎంతో ఉత్సాహంతో, ప్రపంచాన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించారు. ఆయన నడకలో ఒక చక్కటి ఉత్సాహం కనిపించింది, ఆయన్ని అంత సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో చూడటం నాకు ఎంతో గర్వంగా అనిపించింది. కీరవాణి గారూ.. సంగీతంలో మీరు ఒక మేధావి! ఇప్పుడు ఏకాగ్రత, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని మీరు నిరూపించారు. నా మిత్రుని ఈ స్ఫూర్తిదాయకమైన కొత్త అధ్యాయానికి శుభాకాంక్షలు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది! జై హో!'' అని అనుపమ్ ఖేర్ ఎక్స్ లో పేర్కొన్నారు. కీరవాణితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకున్నారు.