తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల వివరాల నమోదు, ధ్రువీకరణకు మరింత సమయం కల్పిస్తూ గడువును మరోసారి పొడిగించింది. తొలుత డిసెంబర్ 10వ తేదీతో ముగియాల్సిన ప్రక్రియను తాజాగా డిసెంబర్ 22వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులకు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు మరో అవకాశం లభించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.
ఓటర్ల జాబితాలో గైర్హాజరు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, మరణించినవారు, డూప్లికేట్ ఓటర్లు అనే కేటగిరీల్లో గుర్తించిన వారిని ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చుతారు. ఈ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఎన్యుమరేషన్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనల నేపథ్యంలో ఈ కేటగిరీ ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను ఈ నెల 18వ తేదీలోగా ముద్రించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఫారాలను పంపిణీ చేసి, తిరిగి సేకరించనున్నారు.
ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను డిసెంబర్ 10వ తేదీలోగా పూర్తి చేయాలి. అనంతరం ఓటర్ల జాబితాకు సంబంధించి నోటీసుల జారీ, క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణతోపాటు వాటి పరిష్కార ప్రక్రియను డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగించనున్నారు. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 22వ తేదీన ప్రచురించనున్నారు. గతంలో నవంబర్ 30వ తేదీన తుది జాబితా విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా ఈ గడువును డిసెంబర్ 22వ తేదీ వరకు పొడిగించారు.