హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మొకిలాలో హెచ్ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ల సమస్య ఎదురవుతోంది. వేలంలో ప్లాట్లు దక్కించుకుని పూర్తి మొత్తాన్ని చెల్లించినప్పటికీ, రిజిస్ట్రేషన్లు పూర్తికాకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో వేలం వేసిన మొదటి, రెండో విడత ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తికాగా.. ఇటీవల వేలం వేసిన ప్లాట్ల విషయంలో మాత్రం ప్రక్రియ నిలిచిపోయింది. రెవెన్యూ శాఖ నుంచి అవసరమైన క్లియరెన్స్ రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మొకిలాలో హైదరాబాద్-శంకర్పల్లి ప్రధాన రహదారి పక్కన హెచ్ఎండీఏ 165.37 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ అభివృద్ధి చేసింది. విశాలమైన రహదారులు, మౌలిక సదుపాయాలతో మొత్తం 1,293 ప్లాట్లను ఏర్పాటు చేసింది. అభివృద్ధి పనులు పూర్తవుతున్న కొద్దీ విడతలవారీగా ఆన్లైన్ వేలం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 700కు పైగా ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించింది. సుమారు మూడు నెలల క్రితం నిర్వహించిన మరో విడత వేలంలో 100కు పైగా ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ వేలంలో చదరపు గజానికి అత్యధికంగా రూ.1,09,500 ధర పలికింది. కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది ఇప్పటికే పూర్తి మొత్తాన్ని చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో వారు హెచ్ఎండీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
లేఅవుట్లోని కొన్ని భూములు ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిధిలోకి వస్తుండటంతో సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సర్వే నంబర్ 96/పిలోని కొన్ని భూభాగాలు నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడంతో రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడింది. ఈ భూములకు సంబంధించిన ప్లాట్లు మూడో, నాలుగో విడతల్లో ఉన్నట్లు సమాచారం. సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలో భూములు కొనసాగుతుండటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్లకు నిరాకరిస్తున్నాయి. హెచ్ఎండీఏకు భూమి అప్పగించిన తర్వాత కూడా రెవెన్యూ అధికారులు సంబంధిత భూభాగాలను నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడమే సమస్యకు కారణంగా చెబుతున్నారు.
ఈ సమస్య పరిష్కారానికి ముందుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. అనంతరం జిల్లా కలెక్టర్ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మొదట రెవెన్యూ శాఖ ప్రత్యేక సర్క్యులర్ ద్వారా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని భావించినప్పటికీ సాంకేతికపరమైన ఇబ్బందులు, భవిష్యత్తులో తలెత్తే న్యాయపరమైన సమస్యల కారణంగా ఆ ప్రతిపాదనను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా.. మంత్రివర్గ ఆమోదంతో ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారని తదుపరి కేబినెట్ సమావేశంలో వాటిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్లలో జాప్యం హెచ్ఎండీఏ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన కూడా అధికారుల్లో వ్యక్తమవుతోంది. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని, కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెచ్ఎండీఏ అధికారులు భరోసా ఇస్తున్నారు.