Date : 18 November 2026
Posted By : RVI

ఇళ్ల నిర్మాణదారులకు గుడ్‌న్యూస్‌.. సెల్లార్లు, పార్కింగ్‌ నిబంధనల్లో మార్పులు

ఇళ్ల నిర్మాణదారులకు గుడ్‌న్యూస్‌.. సెల్లార్లు, పార్కింగ్‌ నిబంధనల్లో మార్పులు

తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనలను సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా చిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు బిల్డర్లకు కూడా ఊరట కలిగించేలా కొత్త నియమావళిని రూపొందిస్తోంది. ఇందుకోసం మున్సిపల్‌ శాఖ అధికారులు సంస్కరణల ముసాయిదా తయారీలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో 2012లో జారీ చేసిన భవన నిర్మాణ నిబంధనలే ఇప్పటికీ ప్రధానంగా అమలవుతున్నాయి. అవసరాలకు అనుగుణంగా మధ్యమధ్యలో మార్పులు చేసినప్పటికీ ఇప్పటివరకు మొత్తం 62 సార్లు సవరణలు చేపట్టారు. 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్మాణదారులకు ఊరట కల్పించేలా పలు కీలక మార్పులు తీసుకొచ్చింది. నిర్మాణ అనుమతుల్లో జాప్యాన్ని నివారించడం, అనుమతుల కాలపరిమితిని పెంచడం వంటి చర్యలు చేపట్టింది. అయితే విడివిడిగా చేసిన ఈ మార్పులన్నింటినీ సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సమగ్ర భవన నిర్మాణ నియమావళిని తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.



కొత్త సంస్కరణల్లో ప్రధానంగా సెట్‌బ్యాక్‌ నిబంధనలను సరళీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రోడ్డు వెడల్పు, స్థలం విస్తీర్ణం, భవనం ఎత్తు ఆధారంగా సెట్‌బ్యాక్‌లను నిర్ణయిస్తున్నారు. ఉదాహరణకు 100 నుంచి 200 చదరపు మీటర్ల స్థలంలో 10 మీటర్ల ఎత్తుతో భవనం నిర్మించాలంటే ఎదురుగా ఉన్న రోడ్డు వెడల్పు 36 అడుగులైతే 1.5 మీటర్లు, 54 నుంచి 72 అడుగుల మధ్య ఉంటే మూడు మీటర్ల సెట్‌బ్యాక్‌ వదలాలి. ఈ నిబంధనలను వివిధ కేటగిరీలుగా విభజించి, ప్రస్తుతం ఉన్న దూరాలను గరిష్ఠంగా 20 శాతం వరకు తగ్గించే ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే స్థలంలో నిర్మాణానికి ఉపయోగించుకునే విస్తీర్ణం పెరుగుతుంది. సొంత ఇళ్లు నిర్మించుకునే వారికి అదనపు స్థలం అందుబాటులోకి రావడంతోపాటు బిల్డర్లకు కూడా నిర్మాణపరంగా ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు.

చిన్న స్థలాల యజమానులకు ఊరట కలిగించేలా ప్రస్తుతం 75 గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు అవసరం లేని పరిమితిని 100 గజాలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే చిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి అనుమతుల ప్రక్రియ మరింత సులభమవుతుంది. అలాగే సెల్లార్‌ నిర్మాణానికి సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కనీసం 900 గజాల స్థలంలో నిర్మించే భవనాలకే సెల్లార్‌ నిర్మాణానికి అనుమతి ఇస్తుండగా.. ఈ పరిమితిని 600 గజాలకు తగ్గించే ఆలోచనలో ఉన్నారు. దీనివల్ల మధ్యస్థాయి స్థలాల్లో నిర్మించే భవనాలకు కూడా పార్కింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశం ఏర్పడుతుంది.