విమాన టికెట్లు బుక్ చేస్తామంటూ ఓ నకిలీ ట్రావెల్ ఏజెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్లు టాలీవుడ్ నటి అనితా చౌదరిని మోసం చేశారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.4.14 లక్షలు కాజేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు బిజినెస్ క్లాస్ రిటర్న్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్న ఆమె.. ఆన్లైన్లో ట్రావెల్ ఏజెన్సీ కోసం వెతికి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సినిమాలో క్యారెక్టర్ రోల్స్ చేసే అనితా చౌదరి హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివసిస్తున్నారు. ఈ నెల 12న విమాన టికెట్ల బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థ వివరాలు ఆమెకు కనిపించాయి. వెబ్సైట్లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు సంప్రదించగా.. రాజేశ్ అనే వ్యక్తి మాట్లాడాడు. వాషింగ్టన్ డీసీకి వెళ్లి తిరిగి వచ్చేందుకు బిజినెస్ క్లాస్ టికెట్ల ధర రూ.4,14,180 అవుతుందని చెప్పాడు. బుకింగ్ పూర్తి చేయడానికి డెబిట్ కార్డు వివరాలు అవసరమని నమ్మించాడు.
అనంతరం ఆమెకు ఓ ఫారం పంపించి అందులో డెబిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని సూచించాడు. ఫోన్లో మాట్లాడుతూ ఆమెను సంభాషణలో ఉంచిన నిందితుడు.. మొబైల్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లను కూడా చెప్పాలని కోరాడు. టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భాగంగానే ఓటీపీలు అడుగుతున్నారని భావించిన అనితా చౌదరి వాటిని అతడికి వెల్లడించారు. దీంతో నిందితులు ఆమె ఖాతా నుంచి నగదును కాజేశారు.