హైదరాబాద్‌లో మరోసారి ఫుడ్ పాయిజనింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. అంబర్‌పేటలోని ఓ హోటల్ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుని తిన్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడిన వారిని తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. అంబర్‌పేట, రామంతపూర్ ప్రాంతాలకు చెందిన ఓ కుటుంబం ఈ నెల 15వ తేదీన గాంధీ బొమ్మ సమీపంలోని ముక్రం బిర్యానీ హోటల్ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుంది.
కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కలిసి ఆ ఆహారాన్ని తిన్నారు. అయితే భోజనం చేసిన కొద్దిసేపటికే వారిలో కొందరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. క్రమంగా మొత్తం 9 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు హోటల్ యజమానిని నిలదీసినట్లు తెలుస్తోంది. బాధితులను తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే వారిలో ఓ మహిళకు న్యూరో సంబంధిత సమస్య తలెత్తడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో బాధితులందరినీ మెరుగైన వైద్యం కోసం బుధవారం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల్లో 7 ఏళ్లలోపు చిన్నారులు ఉండటంతో అక్కడ చికిత్స అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ప్రైవేటు ఆస్పత్రి వైద్య నివేదికలో మహిళకు న్యూరో సమస్య ఉన్నట్లు పేర్కొనడంతో.. బాధితులందరినీ మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన వారిలో సయ్యద్ నసీమ్ సుల్తానా, ఖతీజ తుల్ కుబ్రా, ఆస్మా సుల్తానా, మహ్మద్ ఆమీర్ తదితరులు ఉన్నట్లు సమాచారం. అయితే ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందా అనే విషయం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.