Date : 19 November 2026
Posted By : RVI

'నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది'.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కింగ్ నాగార్జున హామీ

'నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది'.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కింగ్ నాగార్జున హామీ

డ్రగ్స్‌ మహమ్మారిపై పోరాటానికి సినీ, రాజకీయ రంగాలు కలిసి ముందుకు వస్తున్నాయి. యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున మద్దతు ప్రకటించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ నెల 25, 26, 27వ తేదీల్లో హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం సినీనటుడు నాగార్జునను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన నాగార్జున నివాసానికి వెళ్లి యాత్ర ఉద్దేశాన్ని వివరించారు.అనంతరం కిషన్ రెడ్డితో కలిసి నాగార్జున యాత్రకు సంబంధించిన టీ-షర్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు చేపట్టే కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. సమాజాన్ని, ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నాగార్జున పేర్కొన్నారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండేలా యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ‘నషా ముక్త్ భారత్’ వంటి కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.



ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్’ పిలుపు మేరకు ఈ యాత్రను చేపడుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పంలో భాగంగా ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భావితరాల భద్రత కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో యువత, తల్లిదండ్రులు, నగర ప్రజలు సహా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్‌పై పోరాటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు.