తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మరో కీలక బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అగ్నిమాపక, విపత్తు స్పందన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) బాధ్యతలను గురువారం స్వీకరించారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఫైర్ డీజీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం సిబ్బందితో వీసీ సజ్జనార్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తన ఉద్యోగ ప్రస్థానంపై సజ్జనార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 26 ఏళ్ల సర్వీసులో ఇప్పటివరకు 20 పోస్టింగ్‌లు వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎలాంటి పోస్టింగ్ ఇచ్చినా వెనుకడుగు వేయకుండా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు.
కొంతమంది తమ ఉనికిని చాటుకునేందుకు తన పేరు, ఫొటోలను ఉపయోగించుకుంటున్నారని సజ్జనార్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారు కచ్చితంగా చట్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన పేరు లేదా హ్యాష్‌ట్యాగ్ ఉపయోగిస్తే ప్రచారం వస్తుందనే ఉద్దేశంతో కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తాను ప్రస్తుతం సర్వీసులో ఉన్న అధికారిని అని.. ప్రతి అంశంపై రోడ్డెక్కి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని పేర్కొన్నారు.