Date : 20 November 2026
Posted By : RVI

హైదరాబాద్ డాక్టర్ శివరంజని కృషి.. రూ.9 కోట్ల మెడిసిన్ రూ.2.5 లక్షలకే, ఏడుగురు చిన్నారులకు ఉచిత చికిత్స

హైదరాబాద్ డాక్టర్ శివరంజని కృషి.. రూ.9 కోట్ల మెడిసిన్ రూ.2.5 లక్షలకే, ఏడుగురు చిన్నారులకు ఉచిత చికిత్స

ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రాణాధారంగా నిలిచే ఔషధం అందుబాటులో ఉన్నా.. దాని ధర కోట్ల రూపాయల్లో ఉండటంతో తల్లిదండ్రులు చికిత్స చేయించలేని పరిస్థితి. అలాంటి కుటుంబాలకు హైదరాబాద్‌కు చెందిన పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ శివరంజని సంతోష్‌ కొత్త ఆశలు కల్పించారు. ఆమె అవిశ్రాంత ప్రయత్నాలు, అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఏడాది చికిత్సకు రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యే ఔషధాన్ని సుమారు రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు.. ఈ మందును అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఉచితంగా అందించనున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి ఈ మందుల పంపిణీ ప్రారంభం కానుంది.

అలన్‌-హెర్న్డన్‌-డడ్లీ సిండ్రోమ్‌ (ఏహెచ్‌డీఎస్) లేదా ఎంసీటీ8 లోపం (MCT8 deficiency) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు టిరాట్రికోల్‌ (Tiratricol) అనే ఔషధాన్ని ఈ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగిస్తారు. అయితే వాణిజ్యపరంగా లభించే ఈ మందు ధర చాలా ఎక్కువ. ఒక్క చిన్నారికి ఏడాది చికిత్స కోసం సుమారు రూ.4.68 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు డాక్టర్‌ శివరంజని సంతోష్‌, యాక్సెస్‌ టు మెడిసిన్స్‌ ఇండియా ప్రతినిధి కె.ఎం. గోపకుమార్‌ కలిసి ప్రయత్నాలు ప్రారంభించారు.



నెదర్లాండ్స్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ అకౌంటబిలిటీ ఫౌండేషన్‌ (పీఏఎఫ్), ది హేగ్‌లోని ట్రాన్స్‌వాల్‌ ఫార్మసీ సహకారం తీసుకున్నారు. ఈ మెడిసిన్‌లోని క్రియాశీల పదార్థాన్ని ఉపయోగించి ఫార్మాస్యూటికల్‌ కాంపౌండింగ్‌ విధానంలో ప్రత్యామ్నాయ ఫార్ములేషన్‌ను రూపొందించారు. దీంతో ఏడాది చికిత్సకు ఒక్కో చిన్నారికి సుమారు రూ.2.5 లక్షల ఖర్చుతో ఈ మందును అందించే అవకాశం ఏర్పడింది.

డాక్టర్‌ శివరంజని వద్ద చికిత్స పొందుతున్న అరవ్‌ అనే చిన్నారికి ఏహెచ్‌డీఎస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ ప్రయత్నం మొదలైంది. ఆ బిడ్డకు మందు అందించేందుకు తల్లి పవిత్ర సిరోల్కర్‌ తీవ్రంగా శ్రమించారు. జర్మనీ నుంచి కేవలం ఒక నెలకు సరిపడా మందుల కోసం రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు సమకూర్చాల్సి వచ్చింది. ఇంత భారీ ఖర్చుతో నిరంతర చికిత్స అందించడం ఆ కుటుంబానికి కష్టంగా మారింది. దీంతో డాక్టర్‌ శివరంజని ఔషధ కంపెనీలను సంప్రదించడంతో పాటు ఉచితంగా మందులు అందించే మార్గాలను అన్వేషించారు.

కంపెనీల ద్వారా, కంపాషనేట్‌ యూజ్‌ కార్యక్రమాల ద్వారా మందు పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి సెప్టెంబర్‌ 7వ తేదీన సోషల్‌ మీడియా వేదికగా ఆమె బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి నెదర్లాండ్స్‌కు చెందిన పీఏఎఫ్ దృష్టికి వెళ్లడంతో కొత్త మార్గం తెరుచుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా మొదట అరవ్‌తో పాటు వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ)లో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు చిన్నారులను గుర్తించారు. డాక్టర్‌ శివరంజని సోషల్‌ మీడియాలో చేసిన విజ్ఞప్తి తర్వాత మరో చిన్నారి తండ్రి ఆమెను సంప్రదించడంతో మొత్తం ఏడుగురు చిన్నారులకు మందులు అందించే ఏర్పాట్లు జరిగాయి.

ఈనెల 30వ తేదీన హైదరాబాద్‌లోని డాక్టర్‌ శివరంజని క్లినిక్‌లో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులకు తొలి విడత మందులను అందించనున్నారు. మిగిలిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు బెంగళూరులో అందజేయనున్నారు. ఈ మందులను 6 నెలల వరకు మాత్రమే నిల్వ ఉంచుకునే అవకాశం ఉండటంతో 2 విడతల్లో దిగుమతి చేయనున్నారు. ఏడాది చికిత్సకు అవసరమైన మందుల దిగుమతికి కుటుంబాలు వ్యక్తిగత అనుమతులు కూడా పొందాయి. ఈ ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు చికిత్స అందించేందుకు మొత్తం సుమారు 14,200 యూరోలు (అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.15.08 లక్షలు) ఖర్చు అవుతుందని పీఏఎఫ్ వెల్లడించింది. ఇందులో డాక్టర్‌ శివరంజని భారత్‌లో సుమారు రూ.6.09 లక్షలను సమీకరించారు. మిగిలిన రూ.9.13 లక్షలను నెదర్లాండ్స్‌లో సమీకరించే బాధ్యతను పీఏఎఫ్ తీసుకుంది. ఈ నిధులతో ఏడుగురు చిన్నారులకు మందులను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు.

అసలు ఈ ఏహెచ్‌డీఎస్ (AHDS) అంటే ఏంటి?

అలన్‌-హెర్న్డన్‌-డడ్లీ సిండ్రోమ్‌ అనేది ఎంసీటీ8 జన్యువులో మార్పుల వల్ల ఏర్పడే అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఈ లోపం కారణంగా థైరాయిడ్‌ హార్మోన్లు మెదడు కణాల్లోకి సరిగ్గా చేరలేవు. ఫలితంగా పిల్లల్లో నాడీ వ్యవస్థ అభివృద్ధి, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కండరాల బలహీనత, నాడీ సంబంధిత సమస్యలు, అభివృద్ధిలో ఆలస్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడంలో టిరాట్రికోల్‌ మెడిసిన్‌ను ఉపయోగిస్తారు. ఇది థైరాయిడ్‌ హార్మోన్‌ రిసెప్టర్లపై పనిచేస్తూ వ్యాధికి సంబంధించిన కొన్ని ప్రభావాలను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

భారత్‌లోనే మందుల తయారీకి డాక్టర్‌ శివరంజని ప్రయత్నం

ప్రస్తుతం ఏడుగురు చిన్నారులకు మందులు అందుబాటులోకి రావడం తాత్కాలికంగా ఊరటనిచ్చినా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే శాశ్వత పరిష్కారం కాదని డాక్టర్‌ శివరంజని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మందును భారత్‌లోనే కాంపౌండింగ్‌ విధానంలో తయారు చేసి.. దేశంలోని ఇతర చిన్నారులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆమె భావిస్తున్నారు. దీనికోసం యాక్సెస్‌ టు మెడిసిన్స్‌ ఇండియా, ఇతర సంస్థలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా పీడియాట్రిషియన్లు, ఎండోక్రైనాలజిస్టులు, పీడియాట్రిక్‌ న్యూరాలజిస్టులను సంప్రదిస్తూ ఎంసీటీ8 లోపం ఉన్నట్లు నిర్ధారణ అయిన లేదా అనుమానం ఉన్న మరిన్ని చిన్నారులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

‘ప్రపంచంలో ఒక ఔషధం అందుబాటులో ఉండి.. మన పిల్లలకు మాత్రం ఎందుకు అందుబాటులో ఉండకూడదు? ఈ మందును భారత్‌లోనే తయారు చేసి, ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులందరికీ అందించాలి’ అని డాక్టర్‌ శివరంజని పేర్కొన్నారు. ఒక చిన్నారి చికిత్స కోసం మొదలైన ప్రయత్నం.. ఇప్పుడు ఏడుగురు చిన్నారులకు ఉచితంగా మందులు అందించే స్థాయికి చేరింది. భవిష్యత్తులో దేశంలోని మరింత మంది బాధితులకు ఈ ఔషధం అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో డాక్టర్‌ శివరంజని చేస్తున్న కృషి ప్రశంసలు అందుకుంటోంది