ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ సర్క్యూట్ హౌస్‌లో శనివారం ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలకడానికి సిద్ధమైన పోలీసులు, పొరపాటున ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి 'గార్డ్ ఆఫ్ ఆనర్' (గౌరవ వందనం) సమర్పించారు. ఒవైసీ తన భద్రతా సిబ్బందితో కలిసి చేరుకోగానే, అక్కడ మోహరించిన పోలీసులు ఆయనకు సెల్యూట్ చేయడం ప్రారంభించారు. పోలీసులు తనకు గౌరవ వందనం సమర్పించడం చూసిన ఒవైసీ, అక్కడే ఆగి నిలబడి వారి సెల్యూట్‌ను స్వీకరించారు. అయితే, ఆ గార్డ్ ఆఫ్ ఆనర్ వాస్తవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోసం ఏర్పాటు చేశారు.
ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సర్క్యూట్ హౌస్‌కు చేరుకుని అక్కడ వేచి ఉన్నారు. సుమారు 20 నిమిషాల తర్వాత, అసదుద్దీన్ ఒవైసీ తన భద్రతా సిబ్బందితో కలిసి ఆ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఒవైసీ వెంట పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ఉండటంతో సర్క్యూట్ హౌస్ వద్ద ఉన్న పోలీసుల్లో గందరగోళం నెలకొంది. ఆయన రాకను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పొరబడి, న్యాయమూర్తి కోసం సిద్ధం చేసిన గార్డ్ ఆఫ్ ఆనర్‌ను ఎంఐఎం అధినేతకు ఇచ్చేశారు.