Date : 21 November 2026
Posted By : RVI

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అధిష్ఠానం సీరియస్..

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అధిష్ఠానం సీరియస్..

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు హైకమాండ్ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసిన ఏఐసీసీ కార్యదర్శి.. ఈ నెల 23న కొత్త ఇన్‌ఛార్జ్‌ బీఎం సందీప్‌తో సమావేశం కావాలని సూచించారు. ఇదిలా ఉండగా, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని, రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి పై వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిన చేయనుందని తెలిపారు.

క్రమశిక్షణ చర్యలపై స్పందించి, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కొండా సురేఖ విషయంలో మొదటిసారి చర్యలు తీసుకోలేదని, రెండు మూడుసార్లు పరిశీలించిన తర్వాత అధిష్ఠానం చర్యలు తీసుకుందన్నారు.



ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి అంటే కేవలం కొడంగల్, మధిర, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలే కాదని దుయ్యబట్టారు. మునుగోడు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

అంతేకాదు, నిధులు ఇవ్వకుంటే మరో కురుక్షేత్రం తప్పదని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మరో రెండేళ్లే పదవిలో ఉంటారని వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే, అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో అవినీతికి పాల్పడే పాలకులను తెలంగాణ ప్రజలు, చరిత్ర ఎన్నటికీ క్షమించదని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సిద్ధిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు ఆయన పై విధంగా కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులైన బి.ఎం.సందీప్‌ ఆదివారం(నవంబరు 22న) హైదరాబాద్‌‌కు రానున్నారు. గాంధీభవన్‌లో జరగనున్న రాజకీయ వ్యవహరాల కమిటీ (పీఏసీ), ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)ల ఉమ్మడి సమావేశంలో ఆయన పాల్గొంటారు. తర్వాత నవంబరు 23న సోమవారం గాంధీభవన్‌లో ఉదయం మంత్రులతో, మధ్యాహ్నం నుంచి డీసీసీ అధ్యక్షులు, పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమవుతారు.