హైదరాబాద్: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సస్పెండ్ చేశారనే ఆరోపణలతో నాలెడ్జ్ సిటీలోని మెటా ఆఫీసు వద్ద తెలంగాణ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మెటా ఆఫీసు వద్దకు వెళ్లిన యూత్ కాంగ్రెస్ శ్రేణులు.. నినాదాలు చేశారు. సస్పెండ్ చేసిన ఖాతాలపై ఆంక్షలను వారం రోజుల్లోగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు మీడియాకు తెలిపారు.
మెటా కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో హైదరాబాద్‌కు మెటా లాంటి సంస్థను ఒక్కటైనా తీసుకొచ్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశానికి పరిశ్రమలు తేవడానికి గుండాయిజమే మార్గం అని అనుకుంటున్నారా? అని రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నించారు.
‘‘బ్రాండ్ హైదరాబాద్ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలకు తిండి పెడుతోంది. దశాబ్దాలపాటు ఎంతో శ్రమకు ఓర్చి, పరిశ్రమలకు అనుకూలమైన పాలసీలను తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్‌ను తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లోని మెటా ఆఫీసును ధ్వంసం చేయడం గొప్ప విషయమని కాంగ్రెస్ గుండాలు అనుకుంటున్నారు. దీని గురించి గొప్పలు కూడా చెప్పుకుంటున్నారు.