Date : 21 November 2026
Posted By : RVI

సైబరాబాద్‌కు ట్విన్‌ టవర్లు.. 8 అంతస్తుల్లో అత్యాధునిక భవనం.

సైబరాబాద్‌కు ట్విన్‌ టవర్లు.. 8 అంతస్తుల్లో అత్యాధునిక భవనం.

హైదరాబాద్‌ నగరంలో మరో భారీ ప్రభుత్వ భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సైబరాబాద్‌ నగరపాలక సంస్థ (CMC) కోసం అత్యాధునిక ట్విన్‌ టవర్ల తరహాలో కొత్త ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌ ప్రాంతంలో 4.11 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం సీఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.169 కోట్లుగా నిర్ణయించగా.. పన్నులు మినహాయించి రూ.125.79 కోట్లను కాంట్రాక్టు విలువగా ఖరారు చేశారు. స్పెషల్‌ క్లాస్‌ కాంట్రాక్టు సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. ఒప్పందం కుదిరిన నాటి నుంచి 12 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో స్టిల్ట్‌ ప్లస్‌ ఎనిమిది అంతస్తుల్లో ఈ కార్యాలయం నిర్మితం కానుంది. ప్రస్తుతం సీఎంసీ కార్యాలయం హైటెక్స్‌ సమీపంలోని న్యాక్‌ భవనంలో తాత్కాలికంగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి కార్యాలయం ఆధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటీ కంపెనీ క్యాంపస్‌ను తలపించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. ఈ మేరకు కమిషనర్‌ జి.సృజన ఆధ్వర్యంలో వివిధ నమూనాలను పరిశీలించి ట్విన్‌ టవర్ల డిజైన్‌ను ఖరారు చేశారు.



ఖానామెట్‌లో హైటెక్స్‌, నోవాటెల్‌ మధ్య ఈ భవనం నిర్మించనున్నారు. భవనం వెనుక భాగంలో చెరువు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రెండు టవర్లలో ఒకటి ఆరు అంతస్తులు, మరొకటి ఎనిమిది అంతస్తులతో నిర్మితమవుతాయి. భవనం వెలుపలి భాగంలో ముదురు కాఫీ రంగు అద్దాలను అమర్చనున్నారు. ప్రతి అంతస్తులో అన్ని వైపుల నుంచి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ప్రజలకు అవసరమైన సేవలు, ప్రజాప్రతినిధుల సమావేశాలు ఒకేచోట నిర్వహించుకునేలా అంతర్గత విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తును ప్రజల అంతస్తుగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో 195 మంది కూర్చునే సామర్థ్యంతో కౌన్సిల్‌ హాల్‌, ప్రజావాణి కేంద్రం, వీఐపీల గది, డైనింగ్‌ హాల్‌, మీడియా గది ఏర్పాటు చేస్తారు. రెండో అంతస్తులో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కమిషనర్‌ కార్యాలయాలతో పాటు స్థాయీ సంఘం సమావేశ మందిరం, ఫ్లోర్‌ లీడర్ల క్యాబిన్లు, సెక్రటరీ కార్యాలయం ఉంటాయి.