అండాల విక్రయం వెనుక కన్నీటి గాథ.. తండ్రి కిడ్నీ మార్పిడికి డబ్బుల్లేక అండాలు అమ్ముకున్న యువతి
కన్నతండ్రి ప్రాణాలు కాపాడుకోవాలని ఆ యువతి తపించింది. కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో తండ్రికి కిడ్నీ మార్పిడి చేయించాల్సిన పరిస్థితి. అందుకోసం కుటుంబం అప్పులు చేసింది. అయినా మెడికల్ ఖర్చులకు డబ్బులు సరిపోలేదు. అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి రోజురోజుకూ పెరిగిపోయింది. ఇంటి గడప తొక్కుతూ అప్పు తీర్చాలని వేధిస్తున్న వడ్డీ వ్యాపారులు ఒకవైపు.. అనారోగ్యంతో మంచానపడ్డ తండ్రి మరోవైపు. ఈ పరిస్థితుల్లో పాతికేళ్ల ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు కుటుంబాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేయాలనే ఆశతో హైదరాబాద్కు వచ్చి అండాలు విక్రయించే అక్రమ దందాలో చిక్కుకుంది. ఇప్పుడు ఆమె కథ వింటుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన 25 ఏళ్ల యువతి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆమె తండ్రి కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో మార్పిడి ఆపరేషన్ చేయాల్సిందేనని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇందుకోసం కుటుంబం సుమారు రూ.3.5 లక్షలు అప్పు చేసింది. ఆమె తల్లి రోజువారీ కూలీ పనులు చేస్తుండగా.. కుటుంబంలో మరో నలుగురు తోబుట్టువులు చదువుకుంటున్నారు. కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో అండాలు దానం చేస్తే రూ.50 వేలు ఇస్తామంటూ కొందరు ఆమెను సంప్రదించారు.