ఆల్ టైమ్ హైకి 'జొమాటో' షేరు.. IPO ఇన్వెస్టర్లకు లక్షకు రూ.4.75 లక్షలు.. 76 నుంచి రూ.372కు పెరిగిన స్టాక్!

RVIRVI
11 Nov, 26
 0  41
ఆల్ టైమ్ హైకి 'జొమాటో' షేరు.. IPO ఇన్వెస్టర్లకు లక్షకు రూ.4.75 లక్షలు.. 76 నుంచి రూ.372కు పెరిగిన స్టాక్!

భారతీయ ఇ-కామర్స్, ఫుడ్ డెలివరీ దిగ్గజమైన ఎటర్నల్ (జొమాటో, బ్లింకిట్ మాతృ సంస్థ) స్టాక్ మార్కెట్లో సరికొత్త ఆల్ టైమ్ రికార్డులతో దూసుకెళ్తోంది. ఇటీవలి ట్రేడింగ్ సెషన్‌లో ఎటర్నల్ షేరు తన పాత రికార్డులను చెరిపేస్తూ ఏకంగా రూ.372 వద్ద సరికొత్త జీవన కాల గరిష్ఠాన్ని తాకింది. 2021లో రూ.76 ఐపీఓ ఆఫర్ ధరతో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈ కంపెనీ, ఇప్పటి వరకు తన సుదీర్ఘ ఇన్వెస్టర్లకు ఏకంగా 275 శాతం కంటే ఎక్కువ మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. మార్చి 2026లో నమోదైన రూ.212.60 కనిష్ఠ స్థాయి నుంచి కేవలం కొన్ని రోజుల్లోనే 71 శాతం కోలుకుని నిఫ్టీ 50 లోనే బిగ్గెస్ట్ రికవరీ స్టాక్ గా నిలిచింది. కంపెనీ ఆదాయంలో వచ్చిన ఈ అనూహ్య మార్పులకు, నూతన టార్గెట్ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.



రూ.76 నుంచి రూ.372 వరకు ఎటర్నల్ సక్సెస్ జర్నీ

జొమాటో (Zomato Share Price) మాతృ సంస్థ ఎటర్నల్ కంపెనీ స్టాక్ మార్కెట్ ప్రయాణం అనేక మలుపులతో సాగింది. 2021లో రూ.76 ఇష్యూ ధరతో వచ్చి 52 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సంవత్సరంలో టెక్ స్టాక్స్ పతనంతో 2022లో ఏకంగా 57 శాతం నష్టాలను మూటగట్టుకుంది. అయితే, 2023 నుంచి తిరిగి ఊపందుకుని, 2026 లో మార్చిలో తాకిన రూ.212.60 కనిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 71 శాతం పుంజుకుని రూ.361 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో రూ.372 వద్ద ఆల్ టైమ్ హైని తాకింది. ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గింది.

క్విక్ కామర్స్ బ్లింకిట్ తెచ్చిన విప్లవం

కంపెనీ షేరు ధర ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన చోదక శక్తి ఎటర్నల్ అనుబంధ సంస్థ బ్లింకిట్లో వచ్చిన అద్భుతమైన మార్జిన్ల మెరుగుదలే. ఈ ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో బ్లింకిట్ నికర ఆర్ఢర్ విలువ ఏటా 79,3 శాతం పెరిగి రూ.20,940 కోట్లకు పెరిగింది. బ్లింకిట్ సర్దుబాటు చేసిన EBITDA వరుసగా 6వ త్రైమాసికంలో మెరుగై రూ.184 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్తగా 308 డార్క్ స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 2,751 కి చేరింది. మార్చి 2027 నాటికి 3,500 స్టోర్లు, మార్చి 2028 నాటికి 5000 డార్క్ స్టోర్లను తీర్చిదిద్దాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.