SSC జేఈ, ఏఈఈ పరీక్షల తేదీల క్లాష్.. TGPSC కీలక నిర్ణయం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పరీక్ష తేదీకి సంబంధించి కమిషన్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించే SSC జూనియర్ ఇంజనీర్ (JE) పరీక్షలతో ఈ తేదీలు క్లాష్ కావడంతో, నిరుద్యోగ అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని TGPSC ఈ మార్పునకు శ్రీకారం చుట్టింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. SSC నిర్వహించే JE పరీక్షలు మరియు TGPSC AEE పరీక్షలు నవంబర్ 6వ తేదీన ఒకే రోజు నిర్వహించేలా గతంలో షెడ్యూల్ ఖరారైంది. దీంతో రెండు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రెండు పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందిని వివరిస్తూ కమిషన్ను ఆశ్రయించి, పరీక్ష తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన TGPSC, నవంబర్ 6న జరగాల్సిన ఏఈఈ పరీక్షను నవంబర్ 7వ తేదీకి రీషెడ్యూల్ చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే, రెండు పరీక్షల తేదీలు క్లాష్ అవుతున్న అభ్యర్థులు మాత్రమే ఈ సదుపాయం కోసం తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
SSC JE పరీక్షతో పాటు TGPSC AEE పరీక్ష రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, సంబంధిత హాల్ టికెట్లు లేదా దరఖాస్తు పత్రాలను కమిషన్కు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు అధికారిక ఈ-మెయిల్ ద్వారా పంపించాలని TGPSC స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా వచ్చిన విజ్ఞప్తులను మాత్రమే పరిశీలించి, పరీక్ష నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేసింది.