వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాల్లో తేడాలు
- జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ కొత్తగూడెంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. క్రియాటిన్ పెరిగిందని.. మూడు రోజులు ఇంజక్షన్ వేయాలన్నారు. నాలుగో రోజు బాధితుడికి క్రియాటిన్ బాగా పెరిగిందని, కిడ్నీలు పని చేయవని చెప్పారు. ఇక్కడేం చేయలేమంటూ ఖమ్మం వెళ్లాలని సూచించడంతో హడలెత్తిన బాధితుడు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకోవడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారింది.
- పాల్వంచకు చెందిన ఒక వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ స్కానింగ్ కోసం ఓ ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయించారు. అతని కిడ్నీలో 14 మి.మీ. రాయి ఉందని, సత్వర శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. బాధితుడు భయంతో కొత్తగూడెంలోని మరో ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా ఐదు మి.మీ. రాయి ఉందని నివేదిక ఇచ్చారు. శస్త్ర చికిత్స లేకుండా మందులు వాడి ఉపశమనం పొందారు.
న్యూస్‌టుడే, కొత్తగూడెం వైద్యవిభాగం: ఒక్కో ల్యాబ్‌లో ఒక్కో మాదిరిగా వస్తున్న వైద్య నిర్ధారణ నివేదికలు రోగులను హడలెత్తిస్తున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలనే భయంతో ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇష్టారాజ్యంగా ప్రైవేటు వైద్యులతో అంతర్గత ఒప్పందాలతో కొన్ని ప్రయోగశాలలు కొనసాగుతున్నాయి. ప్రతి పరీక్షకు ఒక పర్సంటేజీ నిర్ణయించుకుని ఇబ్బడిముబ్బడిగా నిర్ధారణ పరీక్షలు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న ల్యాబ్‌లను ఆశ్రయించే క్రమంలో నివేదికల్లో వస్తున్న తేడాలు రోగులను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. కనీసం నిబంధనలు పాటించని డయాగ్నోస్టిక్ సెంటర్లలో అనర్హులు పరీక్షలు చేస్తున్న ఘటనలు సైతం ఇటీవల వెలుగు చూశాయి. నివేదికలు రూపొందించే క్రమంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం మరో కారణంగా నిలుస్తోంది. ఇలాంటి పరిణామాలన్నింటిని పరిశీలించి నివారణ చర్యలు తీసుకునే అధికారిక నోటీసుల వద్దే నిలిచిపోతుండటం కొసమెరుపు.
- జిల్లాలో మొత్తం ల్యాబ్‌లు 175
- అనుమతి లేనివి.. సుమారు 2040
- ఈ ఏడాది నోటీసులు 12 మంది అనర్హులకు..
ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్‌ల విషయంలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో నేను, ప్రత్యామ్నాయంగా మా శాఖ ఉద్యోగులు నిరంతరం సోదాలు చేస్తున్నాం. అర్హులతో మాత్రమే పరీక్షలు చేయించాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. అమలు చేయని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. వారి పంథా మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదు.
డాక్టర్ తుకారాం రాఠోడ్, డీఎంహెచ్‌ఓ