మాజీ మంత్రి రూ.25 కోట్లు చెల్లించాలి

RVIRVI
31 Oct, 26
 0  45
మాజీ మంత్రి రూ.25 కోట్లు చెల్లించాలి

జడ్చర్ల, న్యూస్‌టుడే: ప్రాంతీయ ఆసుపత్రిని గుంతలో నిర్మించినందుకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రాయశ్చితంగా రూ.25 కోట్లు చెల్లించాలని, అలాయితే నూతన ఆసుపత్రి నిర్మాణానికి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో స్థలం కేటాయిస్తానని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చెప్పారు. లేదంటే 15 రోజుల్లో ఆయన ఇంటిని ముట్టడిస్తామని తేల్చిచెప్పారు. స్థలం కేటాయిస్తే సొంతంగా రూ.30 కోట్లతో దవాఖానా కడతానని చెప్పిన లక్ష్మారెడ్డి ఆస్తులు.. ఎమ్మెల్యే అయినాక ఎంత పెరిగాయో ప్రజలు గుర్తించాలన్నారు. జడ్చర్ల అంబేడ్కర్‌ కళాభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆసుపత్రి విషయంలో మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రి నిర్మాణానికి నాడు అసైన్డ్‌ స్థలం ఎలా కొన్నారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలం ఆయన సోదరి పేరిట ఉందని ఆరోపించారు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను ఆయన తప్పుపడుతున్నారని, ఎమ్మెల్యేగా 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. సమావేశంలో నిత్యానందం, బుర్ల వెంకటయ్య, సుదర్శన్‌గౌడ్, అశోక్‌యాదవ్, బుక్క వెంకటేశం, మిన్‌హాజ్, మాలిక్‌షాకీర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.