వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ.. రూ.584 కోట్లతో ఆలయ విస్తరణ.. 60 శాతం పనులు పూర్తి
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకోనుంది. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 60 శాతానికి పైగా పనులు పూర్తికాగా.. ప్రధాన ఆలయ మండపాలు స్లాబ్ దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా మొత్తం రూ.584 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ప్రస్తుత పనులను పూర్తి చేయాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.
తొలుత ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను రూ.76 కోట్లతో, నిత్యాన్నదాన సత్రం నిర్మాణాన్ని రూ.35 కోట్లతో ప్రారంభించారు. విస్తరణలో భాగంగా పాత కట్టడాలను తొలగించి శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టారు. ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న మహా మండపాన్ని ముట్టుకోకుండానే మిగతా నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. ఆధునిక నిర్మాణ సాంకేతికతను వినియోగిస్తూ రాఫ్ట్ ఫౌండేషన్ విధానంలో పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వీటీడీఏ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్ సైతం ప్రతి వారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఆలయ విస్తరణలో భాగంగా మహా మండపం, అద్దాల మండపం, కోటి లింగాల మండపం, బ్రాహ్మణ సత్రం, నిత్య కల్యాణ మండపాల నిర్మాణాలు స్లాబ్ దశకు చేరుకున్నాయి. ధర్మగుండం అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. మండపాల నిర్మాణానికి అవసరమైన కృష్ణశిలలను సిద్ధం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తాన్ని గ్రానైట్‌తో ఫ్లోరింగ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఆలయ అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.40 కోట్లు, నిత్యాన్నదాన సత్రం నిర్మాణానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేశారు. సంప్రదాయ ఆలయ నిర్మాణ శైలికి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ పనులు చేపడుతున్నారు.