ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీకి చెక్‌.. కేబీఆర్‌ పార్కు తరహాలో వన్‌వే లూప్‌..!

RVIRVI
29 Oct, 26
 0  36
 ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీకి చెక్‌.. కేబీఆర్‌ పార్కు తరహాలో వన్‌వే లూప్‌..!

హైదరాబాద్ రాయదుర్గం బయోడైవర్సిటీ కూడలి నుంచి ఐకియా రోటరీ, ఇనార్బిట్‌ మాల్‌, నాలెడ్జ్‌ సిటీ వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు సైబరాబాద్‌ పోలీసులు వన్‌వే లూప్‌ విధానాన్ని పరిశీలిస్తున్నారు. రహేజా మైండ్‌స్పేస్‌, డల్లాస్‌ సెంటర్‌, మై హోం భూజా మీదుగా వాహనాలు తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా మార్గాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. వన్‌వే విధానంతో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించాలని భావిస్తున్నారు.హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నారు. రాయదుర్గం బయోడైవర్సిటీ కూడలి నుంచి ఐకియా రోటరీ మీదుగా ఇనార్బిట్‌ మాల్‌, నాలెడ్జ్‌ సిటీ వైపు వెళ్లే మార్గాల్లో నిత్యం వాహనాల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని ఇరుకు దారులు, కూడళ్ల వద్ద వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో అమలు చేసిన తరహాలో వన్‌వే లూప్‌ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.


ప్రతిపాదిత విధానం ప్రకారం.. వాహనాలు బయోడైవర్సిటీ కూడలి నుంచి ఐకియా రోటరీకి చేరుకుని, అక్కడి నుంచి రహేజా మైండ్‌స్పేస్‌ సీ గేట్‌ వద్ద కుడివైపు మళ్లాలి. అనంతరం నాలెడ్జ్‌ సిటీ, డల్లాస్‌ సెంటర్‌ మీదుగా ప్రయాణించి మై హోం భూజా వద్ద మరోసారి కుడివైపు మలుపు తీసుకుని తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా వన్‌వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇలా వాహనాలను ఒకే దిశలో క్రమబద్ధంగా మళ్లించడం ద్వారా ఎదురెదురుగా వచ్చే వాహనాల వల్ల ఏర్పడే అడ్డంకులను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు.