ప్రయాణికులకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్‌ ధర భారీగా తగ్గింపు, రూ.4500 ఆదా

RVIRVI
06 Nov, 26
 0  49
ప్రయాణికులకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్‌ ధర భారీగా తగ్గింపు, రూ.4500 ఆదా

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా మెట్రో – ఆర్టీసీ కామన్ పాస్ ధరల్ని భారీ తగ్గించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో పాస్ ధరల్ని తగ్గించినట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మొదట రూ.8,500 ఉన్న నెలవారీ పాస్ ధర రూ.4,000కు తగ్గించినట్లు ఎక్స్ ద్వారా తెలియజేశారు. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.



ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ మెట్రో-ఆర్టీసీ పాస్ ధరను రూ.4,000కు తగ్గించామని మంత్రి ప్రటించారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించినట్లు తెలిపారు. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్టంగా 50 సింగిల్ ట్రిప్పులకు మెట్రోలో అనుమతి ఉంటుందని.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు ఉండవని స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించినట్లు ప్రకటించారు. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించామని.. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా అవుతుందన్నారు.