తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 2 వేల హోంగార్డు పోస్టుల భర్తీ, DGP కీలక ప్రకటన

RVIRVI
20 Nov, 26
 0  10
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 2 వేల హోంగార్డు పోస్టుల భర్తీ, DGP కీలక ప్రకటన
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్ర పోలీస్ శాఖలో త్వరలోనే 2 వేల మంది హోంగార్డులను నియమించే అంశంపై కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు నియామక నోటిఫికేషన్, ఇతర వివరాలపై పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించారు. డీజీపీ సీవీ ఆనంద్‌ శుక్రవారం నిర్వహించిన మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశంలో హోంగార్డుల నియామకంతో పాటు పోలీస్ శాఖ బలోపేతం, సిబ్బంది సంక్షేమం, రాబోయే కార్యక్రమాలపై కీలక నిర్ణయాల దిశగా సమీక్ష చేపట్టారు. తెలంగాణ పోలీస్ శాఖలో సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు 2,000 మంది హోంగార్డుల నియామకానికి సంబంధించిన అంశాలను సమావేశంలో పరిశీలించారు.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్, ఇతర వివరాలపై అధికారులు చర్చించారు. అయితే నోటిఫికేషన్ విడుదల తేదీ, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల ప్రక్రియ వంటి వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖలో ప్రస్తుతం మంజూరైన సిబ్బంది సంఖ్యను పునఃసమీక్షించాలని నిర్ణయించారు. మారుతున్న పరిస్థితులు, పోలీస్ శాఖ అవసరాలకు అనుగుణంగా నూతన తెలంగాణ పోలీస్ మాన్యువల్‌ను రూపొందించి త్వరగా పూర్తి చేసి విడుదల చేసే అంశంపైనా చర్చించారు. పోలీసు సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించేందుకు వార్షిక శిక్షణ క్యాలెండర్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అలాగే పోలీస్ బ్రాస్‌, పైప్ బ్యాండ్లను పునరుద్ధరించే అంశాన్ని కూడా పరిశీలించారు.


వచ్చే నెలలో నిర్వహించనున్న పోలీస్ రిట్రీట్‌తో పాటు మహిళా పోలీస్ అధికారుల సదస్సు ఏర్పాట్లపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష చేశారు. రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్‌ నిర్వహణకు సంబంధించిన అంశాలను కూడా చర్చించారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో ఉన్న పోలీసులతో పాటు పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. ప్రతి అంశానికి సంబంధించి అధికారులకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగించడంతో పాటు పనుల పూర్తికి గడువులు నిర్ణయించారు. నిర్దేశించిన సమయంలో లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.