ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. రేషన్ కార్డు నంబరే అప్లికేషన్, ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదుపై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న జీవిత బీమా, ఇతర బీమా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆయా పథకాల పరిధిలోకి రాని కుటుంబాలను మాత్రమే కొత్త పథకంలో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ పథకం కింద బీమా పొందిన వ్యక్తి మరణిస్తే వారి నామినీలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. శుక్రవారం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. బీమా చేయించుకోవాలనుకునే వ్యక్తి స్వయంగా నమోదు శిబిరానికి హాజరై తన నామినీల వివరాలు అందించాలి. అనారోగ్యం లేదా దివ్యాంగత్వం కారణంగా శిబిరానికి రాలేని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. శిబిరం ఇన్‌ఛార్జి వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి.
ఈ పథకం కింద ప్రతి కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే బీమా సదుపాయం కల్పిస్తారు. కుటుంబ పెద్ద లేదా కుటుంబ పోషణకు ప్రధానంగా ఆదాయం సమకూర్చే వ్యక్తిని బీమా పరిధిలోకి తీసుకుంటారు. నమోదుకు నిర్ణయించిన వయోపరిమితి 18 నుంచి 59 ఏళ్లు. వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్‌లో పుట్టిన సంవత్సరం మాత్రమే నమోదై ఉంటే జులై 1వ తేదీని జన్మదినంగా పరిగణిస్తారు. పుట్టిన తేదీలో తప్పులు ఉంటే ముందుగా ఆధార్ వివరాలను సరిచేసుకున్న తర్వాతే బీమాకు దరఖాస్తు చేసుకోవాలి. నమోదు ప్రక్రియ మొత్తం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ తప్పనిసరి. దరఖాస్తుదారులు ఆధార్, ఆహార భద్రత కార్డుల ప్రతులతో పాటు తమ మొబైల్ నంబరును అందించాలి.