గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా.. ప్రతి డెలివరీపై 1 శాతం బోనస్, రాహుల్ గాంధీ కీలక ప్రకటన

RVIRVI
14 Nov, 26
 0  23
గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా.. ప్రతి డెలివరీపై 1 శాతం బోనస్, రాహుల్ గాంధీ కీలక ప్రకటన

గిగ్ వర్కర్ల శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం దక్కేలా.. వారి హక్కులు, సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు గిగ్ వర్కర్లకు సంబంధించిన సమగ్రసమాచారం అందుబాటులో లేదని, తాము చేస్తున్న పనికి ఎంత ప్రతిఫలం లభిస్తోందనే విషయంలోనూ స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సంక్షేమం కోసం గతంలో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణ గిగ్ వర్కర్స్ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు.



కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ విధానాలు కంపెనీల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. గిగ్ వర్కర్లను వెట్టిచాకిరీ చేసే కార్మికులుగా మార్చి, వారి శ్రమను దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లను కేవలం సేవలందించే వ్యక్తులుగా కాకుండా, దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వారి హక్కులతోపాటు కుటుంబాల విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.