టాటా గ్రూప్ వార్‌లోకి రాహుల్ గాంధీ ఎంట్రీ.. మోడీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు
టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ లార్డ్స్ బోర్డుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చిన వేళ కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య ఛైర్మన్ నియామకంపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామాలపై దేశంలోని వ్యాపారవేత్తలు మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయన ఓ పోస్టు చేశారు. టాటా గ్రూప్‌ను ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా దీనిపై ఏ వ్యాపారవేత్త కూడా మాట్లాడటానికి ధైర్యం చేయడం లేదని ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారు? చివరకు మిమ్మల్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకునే వరకు వేచి చూస్తారా? అని ప్రశ్నించారు. భారతీయ వ్యాపార రంగం మోడీ, అమిత్ షాల ఆటవస్తువు కాదు. ఈ విషయంలో వ్యాపారవేత్తలైన మీకు ధైర్యం లేకపోవచ్చు.. కానీ మాకు ఉంది. ఈ వ్యవహారంలో జరిగిన తప్పులకు న్యాయం జరిగేలా చూస్తాం అని ఆయన పేర్కొన్నారు.
చంద్రశేఖరన్ పునర్నియామకంపై వివాదం:
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగించాలన్న నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేశారు. 2027 ఫిబ్రవరి తర్వాత కూడా చంద్రశేఖరన్‌ను ఛైర్మన్‌గా కొనసాగించేందుకు సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం ఆమోదం పొందింది. అయితే, ఈ పునర్నియామక తీర్మానం చెల్లదని నోయల్ టాటా వాదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై సోమవారం టాటా సన్స్ కంపెనీ సెక్రటరీ సుప్రకాశ్ ముఖోపాధ్యాయకు ఆయన లేఖ రాసినట్లు సమాచారం. సమావేశ అజెండాలో చంద్రశేఖరన్ పునర్నియామక అంశం లేదని, అందువల్ల ఈ తీర్మానం చెల్లుబాటు కాదని నోయల్ అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది.
లిస్టింగ్‌పై భిన్నాభిప్రాయాలు:
నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ నుంచి వివరాలు తెలుసుకోవడమే ఆ సమావేశం ప్రధాన ఉద్దేశమని సమాచారం. టాటా సన్స్‌లో సుమారు మూడింట రెండొంతుల వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్‌కు నోయల్ టాటా నేతృత్వం వహిస్తున్నారు. బోర్డులో జరిగిన ఓటింగ్ సందర్భంగా చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని ఆయన వ్యతిరేకించగా, టాటా ట్రస్ట్స్‌కు చెందిన మరో ప్రతినిధి వేణు శ్రీనివాసన్ మాత్రం మెజారిటీ సభ్యులతో కలిసి తీర్మానానికి మద్దతు ఇచ్చారు. టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య విభేదాలు కేవలం ఛైర్మన్ పునర్నియామకానికే పరిమితం కాలేదు. టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న ప్రతిపాదనపైనా ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టాటా వివాదంపై రాహుల్ గాంధీ స్పందించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.