మెట్రోకు అనుసంధానంగా పాడ్ కార్లు.. కూకట్‌పల్లిలో PRTS భారీ డిపో.. 104 ఎకరాల్లో ఏర్పాటు..!
హైదరాబాద్ నగరంలో మెట్రో ట్రైన్లకు అనుసంధానంగా పాడ్ కార్లను నడిపేందుకు ప్రతిపాదించిన పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ప్రణాళికలో కీలక ముందడుగు పడింది. ఈ వ్యవస్థకు అవసరమైన డిపోల నిర్మాణం కోసం సుమారు 185 ఎకరాల భూమి అవసరమని అధ్యయన సంస్థ లీ అసోసియేట్స్ గుర్తించింది. పాడ్ కార్ల నెట్‌వర్క్‌కు సమీపంలోనే డిపోలు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో వివిధ ప్రాంతాల్లో అవసరమైన భూములను గుర్తించి నివేదికలో పొందుపరిచింది. ఈ భూమలు వేర్వేరు ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉండటంతో వాటి కేటాయింపుపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ త్వరలోనే సంబంధిత విభాగాలకు లేఖలు రాయనుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని కీలక వాణిజ్య, పరిపాలనా ప్రాంతాల్లో ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఐటీ కారిడార్‌తోపాటు నగరంలోని కీలక వాణిజ్య, పరిపాలనా ప్రాంతాల్లో ప్రయాణం మరింత సులభతరం కానుంది.
పీఆర్‌టీఎస్ మొదటి కారిడార్ కూకట్‌పల్లి నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ డిపో ఏర్పాటుకు 104.8 ఎకరాల భూమి అవసరమని అధ్యయన సంస్థ గుర్తించింది. హైటెక్‌సిటీలో రెండు ప్రాంతాల్లో కలిపి 32.5 ఎకరాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మూడు ప్రాంతాల్లో కలిపి 43.2 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసింది. రెండో కారిడార్‌కు సంబంధించి పీపుల్స్ ప్లాజా ఎదురుగా 0.9 ఎకరాలు, బతుకమ్మ ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో 0.8 ఎకరాలు, సంజీవయ్య పార్కు సమీపంలో 0.7 ఎకరాలు, రాణిగంజ్ బస్ డిపో వద్ద 1.5 ఎకరాలు అవసరమని నివేదికలో పేర్కొంది. ఈ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, వాటి వినియోగానికి సంబంధించిన అంశాలపై తదుపరి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
ఐటీ కారిడార్ మీదుగా పాడ్ కార్ల మార్గం
పీఆర్‌టీఎస్ అలైన్‌మెంట్‌ను ఐటీ కారిడార్‌లోని ప్రధాన కార్యాలయాలు, ప్రైవేటు ఐటీ పార్కులు, మెట్రో స్టేషన్లకు అనుసంధానించేలా రూపొందిస్తున్నారు. ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాల ప్రాంగణాలకు సమీపంగా.. మరికొన్ని చోట్ల వాటి మీదుగా మార్గాన్ని ప్రతిపాదించారు. తొలి అధ్యయన ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గం వరకు 7.62 కిలోమీటర్లు, రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్, నాలెడ్జ్ సిటీ ప్రాంతం వరకు 12.83 కిలోమీటర్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో 14.01 కిలోమీటర్ల మార్గాన్ని అధ్యయనం చేశారు.
ఈ మూడు జోన్లలో కలిపి పది పీఆర్‌టీఎస్ టెర్మినల్ స్టేషన్లను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న మెట్రో, ఎంఎంటీఎస్ వ్యవస్థలతో అనుసంధానం కల్పించేందుకు కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, దుర్గం చెరువు, రాయదుర్గం మెట్రో స్టేషన్లతోపాటు హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పాడ్ కార్ల స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యత్తులో మెట్రో విస్తరణను దృష్టిలో ఉంచుకుని నానక్‌రాంగూడ, విప్రో సర్కిల్, బయోడైవర్సిటీ, ఇందిరానగర్, రాడిన్సన్ జంక్షన్, అమెరికా కాన్సులేట్ మెట్రో స్టేషన్ ప్రాంతాల్లోనూ పీఆర్‌టీఎస్ స్టేషన్లను ప్రతిపాదించారు.
నగరంలోని రెండో అధ్యయన ప్రాంతంలో సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లు, ఇక్బాల్ మినార్ జంక్షన్, అసెంబ్లీ మెట్రో స్టేషన్, సికింద్రాబాద్ వెస్ట్, బేగంపేట మెట్రో స్టేషన్లు, సంజీవయ్య పార్కు, జేమ్స్ స్ట్రీట్ ఎంఎంటీఎస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ ప్రాంతాలు సుమారు 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం మెట్రో, ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి కార్యాలయాలు, నివాస సముదాయాలు, వాణిజ్య కేంద్రాలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని సులభతరం చేయడంలో పీఆర్‌టీఎస్ కీలక పాత్ర పోషించనుంది.
అధ్యయన నివేదిక ప్రకారం.. 2030 నాటికి 17.43 కిలోమీటర్ల నెట్‌వర్క్ పరిధిలో రోజుకు 75 వేల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారు. 2040 నాటికి ఈ సంఖ్య 96 వేలకు, 2050 నాటికి 1.14 లక్షలకు చేరవచ్చునని పేర్కొన్నారు. రెండు అధ్యయన ప్రాంతాల్లో ప్రస్తుతం 10.86 లక్షల మంది నివసిస్తుండగా.. 2050 నాటికి ఈ సంఖ్య 20.88 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఇదే సమయంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య ప్రస్తుత 8.37 లక్షల నుంచి 17.08 లక్షలకు చేరవచ్చని నివేదిక సూచిస్తోంది.
రద్దీకి జీఆర్‌టీఎస్ ప్రత్యామ్నాయం
పీఆర్‌టీఎస్‌లో ఒక పాడ్ కారులో నలుగురి నుంచి ఆరుగురి వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఈ సామర్థ్యం సరిపోకపోవచ్చని అధ్యయన సంస్థ అభిప్రాయపడింది. అందుకే గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (GRTS)ను కూడా ప్రత్యామ్నాయంగా పరిశీలించాలని సూచించింది. ఈ విధానంలో ఒక వాహనంలో 20 నుంచి 25 మంది వరకు ప్రయాణించవచ్చు. అవసరాన్ని బట్టి చిన్న పాడ్ కార్లు, ఎక్కువ మంది ప్రయాణించే వాహనాలను వినియోగించడం ద్వారా రద్దీని నియంత్రించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ప్రణాళిక ఇంకా అధ్యయన దశలోనే ఉంది. భూముల కేటాయింపు, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, నిర్మాణ వ్యయం, ప్రయాణికుల అవసరాలపై తుది నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు అమలు, నిర్మాణ కాలపట్టికపై స్పష్టత రానుంది.