నకిలీ ఆధార్ కార్డులు వినియోగిస్తూ నేరాలు - ఆనవాళ్లు గుర్తించకుండా నేపాల్ ముఠాల ఎత్తులు
నేరాలకు పాల్పడి, తమ ఆనవాళ్లు సులభంగా దొరకకుండా ఉండేందుకు నేపాల్ ముఠాలు నకిలీ ఆధార్ కార్డులు వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ రే భార్య తనూజ రే హత్య కేసులో నిందితులు ఈ విధంగా నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అసలు పేరు ధర్మ తిరువా అని వెల్లడించారు. ఈమె ఉపాధి కోసం భారత్‌కు వచ్చి, కల్పన పేరుతో నకిలీ ఆధార్ కార్డు సంపాదించింది. ఇదే ముఠాలోని మరో సభ్యుడు చంద్రబహదూర్ తమాంగ్ అలియాస్ రంజిత్ తాపా అలియాస్ శకర్చంద్ర లామా పేర్లతో చలామణి అవుతున్నాడు.
మహిళలను నేరాలకు పురిగొల్పుతూఈ ఏడాది మే 7 అర్ధరాత్రి నేరం చేసి నేపాల్ పారిపోయిన ఈ నేపాల్ ముఠాను గుర్తించటం పోలీసులకు సవాల్‌గా మారింది. హైదరాబాద్ పోలీసులు 5 నెలల పాటు శ్రమించి, కీలక నిందితురాలు కల్పన ఆచూకీ తెలుసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న ఆమెతో పాటు మిగిలిన నిందితులను బయటకు రప్పించి, నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం టాస్క్‌ఫోర్స్ బృందం వేట సాగిస్తోంది.
దళారుల ద్వారా నకిలీ ఆధార్లు సంపాదించి
నేపాల్‌లో ఎక్కువగా మహిళలే ఇంటిని నడిపిస్తారు. ఉపాధి కోసం భర్త దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇలా వేలాది మంది నేపాల్ వాసులకు ఉపాధి కల్పించేందుకు మన దేశమే ఎక్కువగా ఆధారమవుతోంది. వీళ్లంతా బిహార్, ఉత్తరాఖండ్, యూపీ, సరిహద్దుల నుంచి భారత్‌లో చేరుతున్నారు. అప్పటికే దిల్లీ, యూపీలో మకాం వేసిన ఇతర నేపాల్ పౌరులతో కలిసి బస చేస్తున్నారు. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నామని చెప్పి, దళారులను ఆశ్రయిస్తున్నారు. వారికి తగినంత డబ్బులిచ్చి నకిలీ పేర్లతో ఇక్కడే ఆధార్ కార్డులు సంపాదిస్తున్నారు.
ఈ గుర్తింపుకార్డు చేతికి రాగానే హైదరాబాద్, ముంబయి, పుణె, దిల్లీ, బెంగళూరు తదితర ప్రధాన నగరాలకు చేరుతున్నారు. సోషల్ మీడియా ద్వారా నేపాలీ పౌరులు ఎక్కడున్నారనే సమాచారం సేకరించి, వారితో స్నేహం కుదుర్చుకుంటున్నారు. తర్వాత వాళ్లుండే నగరాలకు వెళ్తున్నారు. అక్కడకు వెళ్లాక, వారికి దగ్గరైన వ్యక్తులను సోదరులు, జీవితభాగస్వామిగా చెబుతూ ఇళ్లల్లో పనివాళ్లుగా చేరుతున్నారు.దశాబ్దాల కిందటే ముంబయి, పుణె, దిల్లీల్లో మకాం వేసిన కొందరు నేపాలీలు అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నేరాల బాటపడుతున్నారు. వీరిలో పలు కేసుల్లో జైలుకెళ్లొచిన వారే ముఠాలకు ప్రాణం పోస్తున్నారు. తమ పథకం అమలు చేసేందుకు మహిళలను పావులుగా మలచుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుంటున్నారు. వారితో సన్నిహితంగా మెలుగుతూ, వారు పనిచేసే ఇంటి యజమానుల ఆర్ధిక పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఆ ఇళ్లలో దొంగతనం చేస్తే, సొంతూరుకు వెళ్లి, హాయిగా బతికేయొచ్చంటూ వారికి ఆశచూపి, నేరం చేసేందుకు మహిళలను పురిగొల్పుతున్నారు.
పనుల్లోకి తీసుకునే ముందు జాగ్రత్త
ఇటీవల నేపాలీలు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్న క్రమంలో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర వీసీ సజ్జనర్ నగర ప్రజలకు సూచించారు. వారిని పనుల్లోకి చేర్చుకునే ముందు అసలు గుర్తింపుకార్డును తీసుకోవాలని తెలిపారు. అలాగే గతంలో వారు పనిచేసిన ఇంటి యజమానులతోనూ మాట్లాడి నిర్ణయం తీసుకోవాలన్నారు. వారిపై ఏదైనా అనుమానం వస్తే స్థానిక ఠాణా, డయల్ 112లో ఫిర్యాదు చేయాలని సజ్జనర్ కోరారు.